Pages Menu
Categories Menu

Posted by on Jan 6, 2012 in Podcasts, TG Roundup

`కమల’ గారడీ

అవినీతిపై బీజేపీ రెండు నాల్కుల ధోరణి
అవినీతి కళంకితులకు టికెట్లు
పార్లమెంట్ లో అవినీతి వ్యతిరేక ప్రసంగాలు
చెప్పేది ఒకటి, చేసేది మరొకటి
మాటల్లో నిజాయితీ, చేతల్లో అవినీతి గారడీ 
 వికసించిన కమలం అనగానే బీజేపీ గుర్తుకురాకమానదు. కమలం అనగానే స్వచ్ఛతకు, నిర్మలత్వానికీ ప్రతీకగా అనిపించకమానదు. ఎటువంటి బురద అంటకుండా అవినీతి ఊబిలో కూరుకుపోకుండా ప్రజలకు అండగా నిలిచేది తమ పార్టీనే అంటూ సీనియర్ నాయకుడు అద్వానీ , పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వంటి వారు తరచూ బాకాలు ఊదుతున్నా,  బాబూసింగ్ కుశ్వాహా వంటి అవినీతి కలంకిత నేతను అక్కున చేర్చుకోవడంతో బీజేపీ నిజస్వరూపం ఏమిటో తేలిపోయింది.
  కేవలం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపుకోసమే మాజీ మంత్రి, నిన్నమొన్నటి వరకు మాయావతి పక్కన తిరిగిన కుశ్వాహాకు బీజేపీ తీర్థం ఇవ్వడం ఆ పార్టీ పట్ల అంతో ఇంతో ఆశలు పెట్టుకున్నవారికి దిమ్మతిరిగిపోయింది. కళ్లుబైర్లు కమ్మాయి. ఈ మధ్యనే అవినీతికి వ్యతిరేకంగా దేశమంతటా రెండు నెలలపాటు అద్వానీ సాగించిన యాత్ర ఇప్పుడు నగుబాటుగా మారిపోయింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి బాగోతంతోనే పార్టీని అసహ్యించుకుంటున్న జనం, బీజేపీ ప్రస్తుతం కుశ్వాహాను నెత్తికెక్కించుకోవడంతో చీదరించుకుంటున్నారు. బీజేపీకి అండగా ఉంటున్న ఆర్ఎస్ఎస్ సైతం అసహ్యించుకునేరీతిలో పార్టీలో కుళ్లు పేరుకుపోతోంది. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ పాంచజన్య మేగజైన్ ఎడిటోరియల్ లోనే పార్టీ నీతిబాహ్య చర్యలను ఎండగట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 మాటలు చెప్పడం తేలికే, కాషాయం పులుముకుని సూక్తులు వల్లించినంతమాత్రాన చేసినపాపాలు గంగలో కలిసిపోవు. ఎన్ని రథయాత్రలు చేసినా, మరెన్ని నీతి వచనాలు చెప్పినా పార్టీలో అవినీతి చీడ పేరుకుపోతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మాటున ఎంతకైనా తెగించవచ్చన్న కొత్త రాజకీయ సిద్ధాంతానికి బీజేపీ తెరలేపింది.
    ఉత్తరప్రదేశ్ లో సుమారు పదిహేను కోట్ల రూపాయల కుంభకోణంలో కుటుంబసంక్షేమ శాఖ మాజీ మంత్రి కుశ్వాహా చిక్కుకున్నారు. ఆయనపై సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. నేరచరితునిగా ముద్రాంకితుడైన కుశ్వాహాను మాయావతి  గత ఏప్రిల్ లోనే తన పార్టీ నుంచి తరిమేసింది.  ఇద్దరు వైద్యప్రధానాధికారుల హత్య కేసులో కుశ్వాహా నిందితుడు. ఇక అవినీతి ఆరోపణలకు అంతూపొంతూలేదు. అలాంటి వ్యక్తిని బీజేపీ దగ్గరకు తీసుకోవడంతో చివరకు ఆర్ఎస్ఎస్ లోనే ఏవగింపు కలిగేలా తయారైంది. బీజేపీ పట్ల విధేయతను వ్యక్తం చేసిన మర్నాడే కుశ్వాహా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు జరిపి సోదాలు చేశారు. ఇంత జరుగుతున్నా కుశ్వాహాను తమ పార్టీ అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించేసిందంటే ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
 బీజేపీ అవినీతికి కొమ్ముకాయడం ఇప్పుడుకిప్పుడు పుట్టుకొచ్చిన దుర్బుద్దికాదు. గతంలోకూడా అవినీతి మూటను నెత్తినెక్కించుకునే తిరిగింది. పంజాబ్ ఎన్నికలకు కూడా నీతిబాహ్యమైన, నేర చరితులను అభ్యర్థులుగా నిలబెట్టిన ఘనత ఈ పార్టీదే. బీజేపీ ఎమ్మెల్యే రాజ్ ఖురానా సీబీఐ దర్యాప్తు అనంతరం జెల్లో ఉచలు లెక్కిస్తున్న సంగతి కూడా గుర్తుచేసుకోవాల్సిందే.
 తన చుట్టూ ఇంత బురదపేరుకుపోయినా, పైకి మాత్రం అవినీతి వ్యతిరేకంగా తమ పార్టీ ఒక్కటే గట్టిగా పోరాడుతున్నట్టు ఫోజులివ్వడంలో అద్వానీ మొదలుకుని పార్లమెంట్ లో తమ వాగ్దాటితో దుమ్మురేపుతున్న సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వరకు అందరూ సత్యవ్రతులే.
 ఒక పక్క అవినీతి కళంకితులకు పార్టీ టిక్కెట్లు కట్టబెడుతూనే మరో పక్క అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అన్నా హజారేకు మద్దతు ఇవ్వాలనుకోవడం పార్టీ ద్వందప్రమాణాలను ఎత్తిచూపుతోంది. యుపీఏ సర్కార్ ప్రవేశపెట్టిన లోక్ పాల్ బిల్లులో పసలేదనీ, మరింత కఠినమైన బిల్లు అవసరం ఉన్నదని వాదించే బీజేపీ మరో పక్క అవినీతి కొండచిలువలను రక్షించుకోవాలనుకోవడం విడ్డూరమే.
 లోక్ పాల్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగడానికి వీలుగా పార్లమెంట్ ను తిరిగి సమావేశరచేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్  నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలుసుకుని వినతి పత్రం సమర్పించడం గోముఖ వ్యాఘ్రాన్ని తలపింపజేస్తోంది.
            – తుర్లపాటి నాగభూషణ రావు
[audio:https://www.teluglobe.com/wp-content/uploads/2012/01/bjp-scam.mp3|titles=bjp scam]

 

1 Comment

  1. While I hold no flag for BJP, I think these charges on Kushwaha are bogus, motivated and timed. When the biggest scamsters are in power, in this Kali age, how do you expect BJP to fight.

    Also I see no objectivity on your website. There is not a single mention of all the scams, black money and the Powers behind them.