విజయసాయిరెడ్డి స్థితప్రజ్ఞుడా?
అరెస్ట్ అయినా ఎందుకు చలించలేదు?
జైల్లో ఈ ఆటలేంటీ, సీబీఐ ఎదుట ఆ మౌనం ఏమిటి?
జైల్లో అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు?
సీబీఐ ఎదుట ఎందుకు పెదవి విప్పడంలేదు?
రావణ, శకుని, లాడిన్ లు కూడా స్థితప్రజ్ఞులేనా? విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారా?
జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితునిగా ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టాలాని సీబీఐ అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నా, ఆ ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. ఇదే కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విజయసాయిరెడ్డిని సీబీఐ అధికారులు రోజూ తమ ఆఫీస్ కు తీసుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం మళ్ళీ సాయంత్రం చంచల్ గూడ జైలు అధికారులకు అప్పగిస్తున్నారు. అయితే, విజయసాయిరెడ్డి నుంచి సీబీఐ కీలక సమాచారం ఇంతవరకు రాబట్టలేదనే తెలుస్తోంది. దర్యాప్తు అధికారులకు ఆయన ఏమాత్రం సహకరించడంలేదు.అంతకుముందు, అంటే అరెస్టుకు ముందు ఓ 30 రోజులు విజయసాయిని తమ కార్యాలయానికి పిలిపించుకుని సీబీఐ అధికారులు ఎన్నో సార్లు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన పెదవి విప్పలేదు. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అవుతోంది. ఇక సత్యశోధనకోసం నార్కోఎనాలసిస్ ఒక్కటే మార్గమని అధికారులు భావించే పరిస్థితి తలెత్తింది.
విజయసాయిరెడ్డి అరెస్ట్ అయిన మొదటి రోజు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అంతే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. టీషర్ట్ వేసుకుని అమితోత్సాహం ప్రదర్శిస్తున్నారు. మొన్న కోర్టులో కూడా భద్రతా సిబ్బందిని తోసేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో న్యాయమూర్తి మందలించారాల్సివచ్చింది. అయినా విజయసాయి తన తీరు మార్చుకోవడంలేదు. జైల్లో కూడా అంతే హుషారుగా ఉంటున్నారు. ఉదయం ఆరుగంటలకే నిద్రలేచి వ్యాయామం చేస్తున్నారు. తోటి ఖైదీలతో గంటసేపు షటిల్ ఆడుతున్నారు. సరిగా తొమ్మిది గంటలకల్లా సీబీఐ విచారణకు సిద్ధమవుతున్నారు. అంతా టైమ్ ప్రకారం నడుచుకుంటున్నారు. టైమ్ మేనేజ్ మెంట్ తనను చూసి తెలుసుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
ఓడలు బండ్లు అయినప్పుడు, ఉన్నట్టుండి మనస్తాపం కలిగించే సంఘటనలు తలెత్తినప్పుడు ఎవరైనా సహజంగానే క్రుంగిపోతారు. మానసికంగా బలహీనులైతే బోరున విలపిస్తారు. రాజాగా బతికినవాళ్లు ఉన్నట్టుండి జైల్లో చిప్పకూడు తినాల్సి వచ్చినప్పుడు, కటికనేలపై పడుకోవాల్సి వచ్చినప్పుడు, ఖైదీలతో పాటుగా క్యూలో నిలబడి ఆహారం తీసుకోవాల్సివచ్చినప్పుడు మనసు కాకావికలం కావడం సహజమే. అందుకే వీఐపీలు జైల్లోకి రావల్సివస్తే, వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. జైల్లో ఒక్క రోజుకూడా ఉండలేమనీ, తమకు బెయిల్ వచ్చేలా చూడమంటూ తమ తరఫు న్యాయవాదులపై ఒత్తిడి తీసుకువస్తారు. ఆరోగ్యం బాగోలేదంటూ ఖరీదైన ఆస్పత్రిలో చికిత్స ఇప్పించాలంటూ విజ్ఞప్తులు చేసుకుంటారు. మిలాఖత్ సమయంలో తనవాళ్లు వచ్చినప్పుడు వారినిచూసి బోరున విలపిస్తుంటారు. బంగారు కుర్చీలో కూర్చుని వెండీ స్పూన్లతో విందారగించే సంపన్న నిందితులుకు కూడా జైలు జీవితం ఓ గుణపాఠమే. బెయిల్ రాదనీ, ఆస్పత్రిలో చికిత్సపొందే ఛాన్సే లేదని తేలిపోగానే ఇక వేదాంతం పుట్టుకొస్తుంది. భగవద్గీత, పురాణ, ఇతిహాస గ్రంథాలు చదవాలనిపిస్తోంది. ఇతరత్రా ఆధ్యాత్మిక గ్రంథాల పఠనంతో కాలం వెల్లబుచ్చాలనిపిస్తోంది. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న గాలి జనార్దనరెడ్డి చేస్తున్న పని అదే. ఒక్క రోజు కూడా జైల్లో ఉండలేనంటూ కంటనీరుపెట్టుకున్న శ్రీలక్ష్మి సైతం ఇప్పుడిప్పుడే తన మైండ్ సెట్ మార్చుకుంటోంది. గత్యంతరం లేని సమయంలో మనసును మళ్లించడం ఒక్కటే మార్గాంతరం.
అయితే, విజయసాయి రెడ్డి పరిస్థితి వేరుగా ఉంది. ఆయన ముందుగానే తన మైండ్ ను ఇలాంటి విపత్కర పరిస్థితులకు తగ్గట్టుగా మలుచుకున్నట్టు కనబడుతోంది. మానసిక విశ్లేషకులు చెబుతన్న వివరాలనుబట్టి విజయసాయి ప్రస్తుతం మైండ్ గేమ్ బాగా ఆడుతున్నారు. జైలు కోర్టులో షటిల్ కంటే వేగంగా ఆయన మనసు చలిస్తోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం చిక్కకుండా, తనలోని బలహీనతలను బయటపడకుండా మనసును స్థీరికరించుకున్నట్టు కనబడుతోంది. కొంతమంది ఆధ్యాత్మిక చింతనతో మనసును అల్లకల్లోలనుంచి బయటపడేసి ప్రశాంత తీరాలకు చేరుస్తుంటే, మరికొందరు జీవనశైలితో అదే పనిచేస్తుంటారు.
మనం ఏం తింటున్నాం? ఎక్కడ పడుకున్నాం? ఎలా ఉంటున్నాం? అనేవి స్వల్పమైన విషయాలు. మనం ఎంచుకున్న లక్ష్యం, మన ఆశయం సిద్ధించాలంటే అరిషడ్వర్గాలను జయించాలి. ఆధ్యాత్మిక చింతనతో సాగినా, లేదా సైన్స్ ఫార్ములా ప్రకారం మైండ్ ను స్థిరీకరించుకున్నా చివరకు కలిగేది మానసిక ప్రశాంతతే. విజయసాయిరెడ్డిని చూస్తుంటే, ఆయన మైండ్ మేనేజ్ మెంట్ కి అలవాటు పడినట్టుంది. మనం ఏ పని చేపడతామో, అది పూర్తి అయ్యేదాకా ఎన్ని అడ్డంకులు వచ్చినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం స్థితప్రజ్ఞులకు మాత్రమే వీలవుతుంది. అయితే ఇలాంటి వాళ్లు ఎక్కడో హిమాలయాల్లోనో, పాతాళ గుహల్లోనూ ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. మనమధ్యనే, కార్పొరేట్ జంగిల్స్ లో కూడా ఉండవచ్చు. పెద్దపెద్ద హోదాల్లో ఉన్న చాలా మందిలో ఇలాంటి గుణాలు కనపిస్తుంటాయి. ఇలాంటివాళ్లంతా సామాజిక, న్యాయపరంగా ధర్మమార్గానే పోతుంటారని అనుకోవడానికి వీల్లేదు. వారు ఏ మార్గం ఎంచుకున్నా ఈ గుణాలను సంక్రమించుకుంటే కష్టాలు ఎదురైనా నష్టాలు వచ్చినా చిరునవ్వుతోనే సాగిపోతుంటారు. ఏది మంచి, ఏది చెడు అన్నది మైండ్ కి అనవసరం. రావణాబ్రహ్మ, శకుని, గాడ్సే, ఒసామా బిన్ లాడిన్…ఇలాంటి వాళ్లూ స్థితప్రజ్ఞులే అనుకోవాలా? అయిఉండవచ్చు, కాకపోతే వీరు ఎంచుకున్న మార్గాలను సామాజిక న్యాయం తప్పుపట్టింది. చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, దుర్బర జైలు జీవితం అనుభవించిన మహాత్మగాంధీ, నెల్సన్ మండేలా…వీరంతా కూడా స్థితప్రజ్ఞులే. తాము ఎంచుకున్న సిద్ధాంతం కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు.
మళ్లీ మనం విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్దాం. ఆయన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్. రాజశేఖరరెడ్డికి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. పైగా ఆర్థిక వ్యూహకర్త. వారి అఖండ విజయం వెనుక ఈయన మేథోబలం ఉంది. విజయసాయి మొదటినుంచీ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడేవ్యక్తి. పైనచెప్పినట్టు మార్గం ఏదైనా అదేదారిలో చిరునవ్వుతో చివరి వరకు సాగిపోయే నైజం ఆయనది. ఈ తత్వం వల్లనే విజయసాయి సీబీఐ వారికి లొంగడంలేదు. ఈ లక్షణాల వల్లనే ఉల్లాసంగా, ఉత్సాహం ఉండగలుగుతున్నారు. మరి ఆయన నోటి నుంచి నిజాలు రాబట్టేందుకు సీబీఐ ఎలాంటి వ్యూహం పన్నుతుందో వేచి చూడాల్సిందే.
– తుర్లపాటి నాగభూషణ రావు
Just send this guy to Dick Cheney or Donald Rumsfeld! They can make sure this guy will emit all the things in his mind. 🙂 Didn’t CBI know something called ‘water-boarding’!