మాయకు `ముసుగు’

మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందే

ఎన్నికలు అయ్యేవరకు ముసుగులు తప్పవన్న ఈసీ

కొంపముంచుతున్న మాయ `విగ్రహా’రాధన

విపక్షాలకు ఊరట

 

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో ఎన్నికల కమిషన్ దృష్టి మాయావతి విగ్రహాలపై పడింది. ఎన్నికలు అయ్యేవరకు మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందేనంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి మొదటి నుంచీ సంచలనాలకు మారుపేరు. బహుజన సమాజ్ పార్టీని ఏకతాటిపై నడిపించడంలో దిట్ట. అక్కడితో ఆమె ఆగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఉన్నట్టుండి యూపీని నాలుగు ముక్కలుగా విభజించాలంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. తన పర్సనల్ ఇమేజ్ ను ఎప్పటికప్పుడు పెంచుకునేదిశగానే అనేక చోట్ల తన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంతేకాదు, పార్టీ సింబల్ అయిన ఏనుగు ప్రతిమలను సైతం ఖాళీ ఉన్నచోటల్లా పెట్టించేశారు. ఏతావాతా మాయావతికి తన రూపమన్నా, తన పార్టీ సింబల్ అయిన ఏనుగన్నా చాలా మక్కువ. జీవించి ఉన్న కాలంలోనే తన విగ్రహాలను తయారుచేయించుకుని వాటిని ప్రతిష్ఠించిన నేతగా దేశంలోనే సరికొత్త ఒరవడి సృష్టించారు మాయావతి. అంతేకాదు, గౌతం బుద్ధ, బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాల పక్కన తన విగ్రహాలను పెట్టించి మురిసిపోయారు. అదేమని అడిగితే, మాయావతి రాజకీయ గురువు కాన్షీరాం ఆశయాలకోసమే బుడుగువర్గాల అభ్యున్నతికోసమే మాయావతి విగ్రహాలు ప్రతిష్టిస్తున్నట్టు బీఎస్పీ నాయకులు బాకాలు ఊదుతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో విపక్షాలు నోరుమూసుకుని కూర్చోలేవు. అందుకే ప్రతిపక్షనేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. ఇలా మాయావతి విగ్రహాలు వీధికొకటి ఉంటే, పార్టీ గుర్తు ఏనుగు ప్రతిమలు విచ్చలవిడిగా కనబడుతుంటే అది ఓటర్లపై ప్రభావం చూపుతుందంటూ ఆక్షేపించారు. నిజానికి రెండువేలపది అక్టోబర్ లోనే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులందాయి. బీఎస్పీ ఏనుగును గుర్తుగా పెట్టుకోవడాన్ని విపక్షాలు సవాల్ చేశాయి. అయితే, అప్పట్లో ఎన్నికల కమిషన్ ఈ ఫిర్యాదులను కొట్టేస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది.

ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తే, లక్నో, నోయిడాల్లో ఎక్కువ ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే అక్కడే మాయావతి , ఏనుగు విగ్రహాలు కోకొల్లలుగా ఉన్నాయి. గోమతీనగర్ లోని భీమ్ రావ్ అంబేద్కర్ సామాజిక్ పరివర్తన్ స్థల్ లో మాయావతి అతిపెద్ద కాంస్య విగ్రహం ఉంది. దీని ఎత్తు ఇరవైనాలుగు అడుగులు. ఇందుకోసం మాయావతి ప్రభుత్వం ప్రజల సొమ్మును అక్షరాలా కోటి నలభైనాలుగు లక్షలు ఖర్చుపెట్టారు. ఈ స్మారక స్థలిలోనే మరో రెండు మాయావతి కాంస్య విగ్రహాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి గ్యాలరీలోనూ మరొకటి ప్రధాన హాల్ లోనూ ఉన్నాయి. గ్యాలరీలోని విగ్రహం ఎత్తు 18 అడుగులు. దీనికి అయిన ఖర్చు నలభైఏడు లక్షల ఇరవైఐదు వేల రూపాయలు మాత్రమే.  మెయిన్ హాల్ లో తొమ్మిది అడుగుల విగ్రహం ఉంది. దానికి అయిన ఖర్చు ఇరవైమూడు లక్షలు. అంతేకాదు, ఇరవై లక్షలతో గోమతి తత్బంద్ వద్ద మరో విగ్రహం వెలిసింది. ఈ విగ్రంలో ఏదో తేడాలు కన్పించడంతో మాయావతి దాన్ని మార్చేదాకా వదలలేదు. రెండువేలతొమ్మిదిలో మాయావతి మొదటిసారిగా తన సొంత విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్నారు.

మొత్తానికి మాయావతి విగ్రహారాధనే ఇప్పుడు ఆమె కొంప ముంచేలా ఉంది. తన స్వీయప్రతిమలపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించడం, వాటిని ఎన్నికలు అయ్యేవరకు కప్పిఉంచాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఓటర్లలో మాయతొలిగిపోతుందన్నదే ప్రతిపక్షాల ఆశ. మరి ఈ ముసుగుల్ని మాయావతి ఎలా తీసేస్తారో చూడాలి.

– తుర్లపాటి నాగభూషణ రావు