తెలంగాణ జ`గన్’

 

అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కుంటున్న కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారనీ, అక్రమాల పుట్ట కదలిపోతుందనీ, ఆయనఅరెస్ట్ అవడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనేకాకుండా ప్రజల్లో కూడా వదంతులు వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో జగన్ ఏం చేయబోతున్నారు ?  భయపడిపోతున్నారా…? లేక ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ధైర్యంగా ఎదుర్కుని తనను తాను రక్షించుకుంటూనే తన పార్టీని సైతం బలోపేతం చేయబోతున్నారా…? అసలు ఆయన ఏ ధైర్యం చూసుకుని అంత గుండెనిబ్బరంగా ఉండగలుగుతున్నారు? ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలేమిటి…? ఈ విషయాలపై ఇవాళ్టి ఫోకస్.

ఆర్మూర్ రైతు దీక్షతో జగన్ ఊపిరిపీల్చుకున్నారనే చెప్పాలి.  తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన జగన్ , ఆర్మూర్ రైతు దీక్ష తనకో అగ్ని పరీక్ష అవుతుందని అనుకున్న జగన్ కొద్దిపాటి నిరసనలతోనే బయటపడ్డారు. మొత్తానికి దీక్ష విజయవంతం అయినట్టుగానే భావించుకోవాలి. దీంతో తెలంగాణ పర్యటనలపై జగన్ లో ఆలోచనలు మొగ్గతొడిగాయి. నెమ్మదిగా తెలంగాణ గడ్డలో పాగావేయాలని చూస్తున్నారు. ఆర్మూర్ అందించిన ఉత్సాహంతో జగన్ ఇప్పుడు తెలంగాణలోనే జోరుగా పాదయాత్రలు, ర్యాలీలు, ఓదార్పు యాత్రలు చేయాలనుకుంటున్నారు.

సీబీఐ ఎంతగా ఉచ్చు బిగించినా, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలే తన అసలుసిసలు బలం అంటూ ముందుకు సాగిపోతున్న జగన్ కు ఇకపై తెలంగాణలో కూడా చెక్ పెట్టే శక్తి ఏదీ ఉండకపోవచ్చు.

ఆర్మూర్ అందించిన నైతిక బలంతో జగన్ త్వరలోనే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టవచ్చు. ప్రజాసమస్యలపై తెలంగాణ గడ్డమీదనే పోరాటాలు చేయనూవచ్చు. మార్చిలో ఓదార్పు యాత్రకు సిద్ధం కావచ్చు.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయిలో జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య, ఆదిలాబాద్ లో టైగర్ జోన్, రంగారెడ్డి జిల్లాలో వక్ఫ్ భూముల ఆక్రమణ, గిరిజన సమస్యలపై దశల వారీగా ఆయా ప్రాంతాల్లో దర్నాలు, దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని జగన్ ఆలోచిస్తున్నారు.

మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జగన్ తన పార్టీకి తెలంగాణలో జవసత్తాలు నింపవచ్చు. అదే జరిగితే, రాష్ట్రమంతటా జగన్ రాజకీయ హవా సాగుతుందనే అనుకోవాలి. మరి జగన్ ఎదుగుదలకు కాంగ్రెస్ ఎలా మోకాలు అడ్డుపెడుతుందో చూడాలి.

 

– తుర్లపాటి. ఎన్.ఆర్.