నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?
బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?
ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా?
2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో కాస్తంత నిరుత్సాహపడిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సాంతం టిడిపీకి దూరంగా జరిగిపోయారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. కాస్త ఉప్పందితేచాలు హడావుడి చేసే ఛానెళ్లు ఈ విషయంపై ఇప్పటికే ప్రత్యేక కథనాలతో ఊదరగొట్టాయి. ఎస్ఎంఎస్ పోల్స్ కూడా నిర్వహించాయి. ఈ మధ్య సంక్రాతి సంబరాలకు బాలయ్య తన వియ్యంకుడైన నారా చంద్రబాబు సొంతఊరు నారావారి పల్లెకు వెళ్లారు. ఈ పర్యటనను కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ గానే చూడటంలేదనీ, అక్కడ సొంతూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ కూడా జరగడంతో పార్టీ రంగులు కూడా పులుముకున్నాయని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పిలిచిఉంటే ఎలాంటి విమర్శలకు తావుండేది కాదు. ఇప్పటికే హరికృష్ణ, చంద్రబాబు మధ్య అఘాతం ఉండనే ఉంది. ఇప్పుడు యువహీరోతో కూడా దూరం పెంచుకుంటే పార్టీకి నష్టమే కలుగుతుందని టిడిపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక నిర్ణయం తీసుకోవచ్చు. అదే జరిగితే, వచ్చే ఎన్నికల్లో టిడిపీలోని చీలికలు సహజంగానే వైఎస్సార్ పార్టీకి అనుకూలంగా మారవచ్చు. అందుకే, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మరో పక్క కాంగ్రెస్ కూడా చంద్రబాబు నైజాన్ని దుమ్మెత్తిపోస్తోంది. బాబు ఎవరినైనా ఉపయోగించుకుని వదిలేస్తుంటారనీ, అది ఆయన స్వభావమేననీ, జూనియర్ ఎన్టీఆర్ ను సైతం అలాగే వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఒక టీవీ ఛానెల్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారా వర్సెస్ జూ.ఎన్టీఆర్ మధ్య వార్ మొదలైందంటూ మీడియా హడావుడి చేస్తోంది. మరి చివరకు ఈ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.
– టీఎన్నార్