ఆసియాలోనే మన బ్యూరోక్రసీ అధ్వాన్నం

అధికారగణంలో అలసత్వం

ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వక తప్పదు

ఐఏఎస్ ల్లోనూ కళంకితులు

వ్యాపారవేత్తలను చిరాకుపెడుతున్న బ్యూరోక్రసీ

 

మన అధికారగణం నిజస్వరూపమేమిటో ప్రపంచానికి మరోసారి తెలిసిపోయింది. ఆసియాలోనే మనదేశంలోని బ్యూరోక్రసీ అత్యంత అధ్వాన్నంగా ఉన్నదట. పూర్తగా తీసికట్టుగా ఉంటే పది మార్కులుగా నిర్దారించి చూస్తే, మనదేశ బ్యూరోక్రసీకి 9.21 పాయింట్లతో రేటింగ్ వచ్చింది. సింగపూర్ లోని ఓ ప్రతిష్ఠాత్మక కన్సల్టింగ్ సంస్థ ప్రపంచ దేశాల్లోని బ్యూరోక్రసీ పోకడలకు రేటింగ్ లు ఇచ్చింది.

ఒక్కమాటలో చెప్పాలంటే, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చైనా కంటే మనదేశంలోనే బ్యూరోక్రసీ తీసికట్టుగా ఉంది.

సరే, బ్యూరోక్రసీ అధ్వాన్నంగా ఉన్న దేశాల సంగతి సరే, మరి అత్యద్భుతంగా ఉన్న దేశాలేమిటో కూడా ఈ సర్వే తేల్చిచెప్పింది.  2.25తో సింగపూర్ మెరుగైన బ్యూరోక్రసీ ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. 3.53తో హాంగ్ కాంగ్ రెండో స్థానంలో ఉంది.

మనదేశంలో వ్యాపారవేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది బ్యూరోక్రాట్స్ మీదనే. అధికారగణంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి కారణంగా దేశాభివృద్ధి కుంటుపడిపోతున్నదని వ్యాపారవేత్తలు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.

మనదేశంలో ప్రభుత్వ  కార్యాలయాల్లో ఏపని కావాలన్నా లంచం ఇచ్చుకోకతప్పడంలేదు. అదికారులకు ముడుపులు ఇచ్చుకుంటేనేకానీ ఏ వ్యాపారవేత్తకూ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంలేదు. దేశంలోని  ఆర్థిక కుంభకోణాల పుట్ట కదిలిస్తే అవినీతి కళంకిత అధికారుల చిట్టా బయటపడుతుంది. ఓబుళాపురం గనుల అక్రమ లీజింగ్ కావచ్చు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలే కావచ్చు, లేదా జాతీయ పథకాల అమలుల్లోని లేపాలేకావచ్చు, ప్రతి దాంట్లో అధికారగణం వాటా కచ్చితంగా ఉందనే చెప్పాలి. అందుకే సీబీఐ తవ్వినకొద్దీ అధికారుల పాపాలు కూడా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రుల అండతో అక్రమంగా , అడ్డదారిన ఫైళ్లపై సంతకాలు చేసి,  ఆ తర్వాత తమకేపాపము తెలియదంటూ తప్పించుకోవాలని చూడటం జవాబుదారీతనాన్ని కప్పిపుచ్చడమే అవుతుంది.

ఇదే విషయం తాజా సర్వే కూడా తేల్చిచెప్పింది. ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదా దిగువ స్థాయి అధికారులు కావచ్చు, వీరు తప్పులకు జవాబుదారీగా ఉండరు. అధికారులే చాపకిందనీరులా దేశంలో అవినీతిని వ్యాపింపజేస్తున్నారన్నది పచ్చి నిజం. అందుకే పటిష్టమైన లోక్ పాల్ బిల్లు రావాల్సిందే. అందుకోసం ముక్తకంఠంతో పోరాడాల్సిందే.

 

 

Turlapati Nagabhushana Rao MSc

Sr.Journalist

Program Director

Tharanga Media

1 Comment on "ఆసియాలోనే మన బ్యూరోక్రసీ అధ్వాన్నం"

  1. I regularly follow your articles. More than this article, I like your new title. All the best sir..

Comments are closed.