జగన్ జైలుకు వెళ్లడం ఖాయమేనా?
జగన్ కంటే ముందు ఎవరెవరు అరెస్ట్ అవుతారు?
చిట్టచివర్లోనే జగన్ ను అరెస్ట్ చేయాలనుకోవడం ఓ వ్యూహమా ?
జగన్ పై నేషనల్ మీడియా కూడా ఎందుకు కక్షకట్టింది?
మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక కథనాల వెనుక నిజంగా కుట్ర దాగుందా?
రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకునేవారంతా ఇప్పుడు ఈ ప్రశ్నలే అడుగుతన్నారు. అందుకే వీటి గురించి విశ్లేషించుకుందాం.
మొదటి ప్రశ్న… జగన్ జైలుకు వెళ్లడం ఖాయమేనా? దీనికి సూటిగా సమాధానం చెప్పుకోవాలంటే అదంతా జగన్ మనస్తత్వంమీదనే ఉంది. జగన్ పై మోపబడిన అక్రమార్జన కేసు, ఇతర ఆరోపణలకంటే బలమైనది ఆయన రాజకీయంగా వేస్తున్న ఎత్తులు. బలమైన కాంగ్రెస్ పార్టీని, దాన్ని నడిపిస్తున్న మేడం సోనియాని ఎదిరించగల వ్యక్తిగా స్వయం ప్రకటితం చేసుకున్న జగన్ పై ఇప్పుడు వార్ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోనియా వర్సెస్ జగన్ మధ్య జరుగుతున్న వార్ ఫలితమే జగన్ ఇక్కట్లు, కష్టాలు. మనదేశంలో దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలే. సీబీఐ కూడా ఇందుకు భిన్నమైనదేమీకాదు. ఈకారణంగా జగన్ పై సీబీఐ బిగించే ఉచ్చు కాంగ్రెస్ దిగానే భావించాలి. ఈ విషయం జగన్ కి కూడా తెలుసు. తెలిసినా తన వైఖరి మార్చుకోవడంలేదు. ఇందుకు ప్రధానమైన కారణం, తనకు ధనబలంతోపాటు, జనబలం కూడా ఉన్నదని పూర్తిగా విశ్వసించడమే. 2014నాటి ఎన్నికల్లో తన పార్టీ అత్యద్భుత విజయం సాధిస్తుందన్న గుడ్డినమ్మకమే జగన్ ను నడిపిస్తోంది. అదే ఇప్పుడు పీకలలోతు గోతిలో పడేసేలా చేస్తోంది. ఇప్పటికే రెండు మూడుసార్లు చేతికందిన అవకాశాలను జగన్ చేజార్చుకున్నారు. మొన్నటికిమొన్న రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా, కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోగలిగారు. ఇది సహజంగానే కాంగ్రెస్ అధిష్టానికి ఎక్కడకాలాలో అక్కడ కాలింది. దీనికి తోడు పార్లమెంట్ లో ప్రతిష్టాత్మక లోక్ పాల్ బిల్లును కాంగ్రెస్ గడపతొక్కించినప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళి అక్కడ చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్ పాల్ బిల్లును ఓ అస్త్రంగా మలుచుకోవాలని కాంగ్రెస్ తపిస్తున్నప్పుడు అడ్డుతగలడం, బిల్లుకు చట్టబద్దత రాకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడిన పార్టీలు, నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది.
యుద్ధమంటూ ప్రారంభమైతే న్యాయ ధర్మ విచక్షణ మందగిస్తుంది. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని దెబ్బతీయడమే యుద్ధనీతి. మేడం సోనియా ప్రస్తుతం ఆపనిలోనే ఉన్నారు. నేషనల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారనీ, అందుకే నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా తనపై ఎల్లోజర్నలిజంతో బురదచల్లుతున్నాయంటూ జగన్ చేస్తున్న వాదనను పూర్తిగా కొట్టిపారేయలేం. ఏతావాతా ఈ కారణాలన్నింటినీ బేరీజు వేసుకుంటే జగన్ అరెస్టు దగ్గర్లోనే ఉన్నదనిపిస్తోంది. జగన్ స్వయంప్రకటిత నిర్ణయాలే ఆయన కొంప ముంచబోతున్నాయి.
అయితే, జగన్ ను నేరుగా అరెస్టు చేయడంకంటే, అందుకు తగ్గ సానుకూల వాతావరణం సాధించాలన్నదే సోనియా స్ట్రాటజీ. ఆ దిశగానే ఆమె పావులు కదుపుతున్నారు. ఇక రాయబారాలు, రాజీలు, బేరాలు లేవనే అనిపిస్తోంది. దీనికి సంకేతాలుగానే టైమ్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోని కథనాలను భావించాలి. అక్రమఆస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న సాక్షి వైస్ చైర్మన్, బహుముఖ మేథావి అయిన విజయసాయి రెడ్డి అరెస్టుతో కథ స్పీడందుకుంది. జగన్, ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డికి మేథోపరమైన వ్యూహాలు అందించడంలో విజయసాయిరెడ్డిదే కీలకపాత్ర. తండ్రీకొడుకులను విజయపథాన నడిపించడంలో ఈ విజయుడి హస్తం ఎంతైనా ఉంది. అందుకే ముందుగా విజయసాయిరెడ్డి పనిపడుతున్నారు. ఆ తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అంబటి రాంబాబును ఇరికించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి సైలెంట్ కిల్లర్ అయితే, అంబటి వైఎస్సార్ ఫ్యామిలీకి మౌత్ పీస్ లాంటి వారు. తన వాగ్దాటితో తిమ్మిని బ్రమ్మిని చేయడంలో ఈయన దిట్ట. అంబటి వాగ్దాటికి అడ్డుకట్టవేస్తే జగన్ కు మరో బ్రేక్ పడినట్టే అవుతుంది. ఈనెల రెండో వారంలో ఈ పని జరిగేలా ఉంది. ఈలోగానే కొండా సురేఖ వంటి వారి ఆట కూడా కట్టించవచ్చు. అన్ని దారులు మూసేసిన తర్వాతనే సింహాన్ని వేటగాడు సునాయాసంగా బంధించగలుగుతాడు. జగన్ విషయంలో జరగబోయేది అదే. జగన్ అరెస్టు అయినా, జైలుకు వెళ్ళినా బయట ఆర్బాటాలు, హంగామాలు, వాక్ శూరత్వాలు లేకుండా చేయడమే ఇందులోని అంతరార్థం.
జగన్ అరెస్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఎందుకంటే, ఆయన వెంట జనబలం ఉంది. పేదలపాలిట పెన్నిధిగా పేరుతెచ్చుకున్నారు. ఓదార్పు యాత్రలతో పాపులర్ నేతగా ఎదిగిన జగన్ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టబోతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జనవరి పది నుంచి నలభైఎనిమిది గంటలపాటు ఆయన తలపెట్టే రైతు దీక్ష సవ్యంగా సాగితే తెలంగాణలో కూడా ఆయన బలం పెరిగిపోతుంది. గతంలో అంటే, రెండువేలపది మే నెలలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణానికి ఓదార్పు యాత్రకోసం వచ్చినప్పుడు జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈసారి అలా జరగకుండా సానుకూలత సాధించేందుకు చాపకిందనీరులా ప్రయత్నిస్తున్నా, కాంగ్రెస్ ఫోర్స్ తో ముందుకు కదలిన తెరాస దీనికి మోకాలడ్డవచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి శాసనపక్షనేత ఈటెల రాజేందర్ చేస్తున్న హెచ్చరికలు దీన్నే సూచిస్తున్నాయి.
మొత్తానికి జగన్ కు గడ్డుకాలం వచ్చినట్టే కనబడుతోంది. ఒక్కోదారి మూసుకుపోతుండటంతో అతి త్వరలోనే జగన్ అరెస్టు తప్పకపోవచ్చు. రాష్ట్రంలోని రెండు పత్రికలతో పాటుగా, నేషనల్ మీడియాలోని మరో రెండు పత్రికలు కూడా తోడై తనపై కక్ష కడుతున్నాయనీ, తనపై బురదజల్లుతున్నాయంటూ జగన్ ఇప్పుడు సాక్షి పత్రిక, ఛానెల్ ద్వారా ఎంతగా ఆక్షేపించినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. జగన్ తన మైండ్ సెట్ మార్చుకుంటే కొంతలోకొంత ఊరట కలిగవచ్చు. ఇది కూడా చివరాఖరి అవకాశంగానే భావించాలి. ఇటు రాష్ట్ర ప్రజలకూ, అటు దేశప్రజలకూ ఒక్కో వాస్తవం మీడియా ద్వారా తెలుస్తుండటంతో జగన్ కు ఇప్పటివరకు కంచుకోటలా ఉన్న జనబలం వీగిపోవచ్చు. అదే జరిగితే రాబోయే కాలంలో జగన్ ఏకాకిగా మిగిలిపోవచ్చు.
– తుర్లపాటి నాగభూషణ రావు
Podcast: Play in new window | Download (Duration: 8:00 — 9.3MB) | Embed
Subscribe: RSS