మన పండుగలు చాలామటుకు సూర్య చంద్రుల గమనం మీదనే ఆధారపడి ఉంటాయి. అందుకే వీరినే ప్రత్యక్షనారాయణులుగా భావిస్తుంటాం. తెలుగువారు చాంద్రమానం ప్రకారమే పండుగల్ని జరుపుకోవడం వల్లనే తిధులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం లెక్కలు వేసేవారికి తిథుల ప్రకారం వచ్చే పండుగలు కాస్తంత తికమకగా కనిపించవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, ముక్కోటి ఏకాదశి ఇంతకీ బుధవారం (04-01-12) జరుపుకోవాలా, లేక గురువారం (05 – 01 – 2012 జరుపుకోవాలా అన్న మీమాంశ ఎదురైంది. ఈ తికమకమీదనే తెలగుటీవీల్లో చర్చలు దంచేశారు. ఏకాదశి బుధవారం పగలంతా పూర్తిగానే ఉంది. అలాంటప్పుడు బుధవారం ముక్కోటి జరుపుకోకుండా గురువారం ఎందుకు జరుపుకోవాలన్న ధర్మసంకటం ఏర్పడింది. ఇక్కడో విషయం గమనించాలి. గురువారం తెల్లవారు ఝామున ఏకాదశి తిథే ఉంది. అది తెల్లవారి ఏడుగంటల ఏభై నిమిషాల దాకా ఉంది.
మన తెలుగువారి పండుగ సాంప్రదాయాల ప్రకారం ఆలోచిస్తే గురువారం ఉదయమే ముక్కోటి ఏకాదశిగా భావించి ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలన్నదే పండితుల అభిప్రాయం.
పండుగ అంతరార్థం, పరమార్థం తెలుసుకుని తిథి వేళలను గమనించి ఏరోజు జరుపుకోవాలో పండితులు నిర్థారిస్తుంటారు. కాకపోతే మీడియా మాత్రం తన రేటింగ్స్ పెంచుకోవడం కోసం రాద్ధాంతపు చర్చలు నిర్వహిస్తుంటుంది. బుధవారం జరిగింది కూడా అదే.
నరక చతుర్ధశి రోజున తెల్లవారుఝామున నరకాసుర వధ సాగించి బాణసంచా కాల్చి స్నానాలు చేయడం విదాయకం. అంటే చతుర్ధశి తెల్లవారుఝాము ఘడియల్లో ఎప్పుడు ఉంటే ఆరోజే నరక చతుర్దశిగా భావించాలి. అలాగే, దీపావళినాడు రాత్రిపూట టపాకాయలు కాల్చడం సాంప్రదాయం. అంటే, అమావాస్య తిథి రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల మధ్య ఎప్పుడు ఉంటే ఆరోజునే దీపావళి జరుపుకోవాలి. ఇదే పండితులు సూచించేది. సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనంతో ముడిపడిఉంది. సూర్యుడు మకరరాశిలోకి వచ్చిన వేళనే మకరసంక్రాంతి పాటిస్తుంటాం. ఈ కారణంగా సంక్రాంతి పండుగ మాత్రం ప్రతి ఏటా జనవరి 14, 15 తేదీల్లోనే వస్తుంటుంది. ఇక ఉగాది పండుగ చైత్రశుద్ధపాడ్యమినాడు వస్తుంటుంది. ఆరోజు ఉదయంపూట తలంటి పోసుకుని ఉగాది పచ్చడి ఆరగించాలి. సాయంత్రానికి పాడ్యమి తిథి లేకపోతే ఉదయం పూటే పంచాంగ శ్రవణం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
ఇలా మన పండుగ తిథులు, ఆచారాల విషయంలో పండితులు బల్లగుద్ది మరీ కచ్చితమైన మార్గదర్శకాలు అందిస్తుంటే, మీడియా మాత్రం ప్రతిదీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం. కేవలం రేటింగ్స్ పెంచుకోవడం కోసం టివీ ఛానెళ్లు ఒకదానితో మరొకటి పోటీపడటంతోనే ఈ గందరగోళం ఏర్పడుతోంది.
– తుర్లపాటి నాగభూషణ రావు
Podcast: Play in new window | Download (Duration: 3:22 — 4.0MB) | Embed
Subscribe: RSS