మీడియాలో అవినీతి మాటేమిటి?

రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా ఓసారి తన ఒంటిమీద ఎంతటి అవినీతి మురికిని అంటించుకుందో పట్టించుకుంటున్నదా?
రాజకీయ నాయకులపై అవినీతిపరులన్న ముద్రవేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారు కూడా మన సమాజ వాస్తవ స్థితిగతులను అద్దం పడుతున్నారు. అంటే అవినీతి విషయంలో వాళ్లు ఒంటరికాదు. వారితోపాటు సమాజంలో అనేక వర్గాల వాళ్లు, అనేక వృత్తుల వాళ్లు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. మీడియా కూడా అంతే. అయితే, తనను – గురవిందగంజ అని ఎవరైనా అంటే ఒప్పుకోదు. `చెల్లింపు వార్తల’ విషయం ఎవ్వరికీ తెలియదనుకోవడం ఒట్టి భ్రమ. అక్కడితే ఆగడంలేదు. కొన్ని మీడియా సంస్థలు కేవలం కొంత మంది బడా వ్యక్తులు ఇస్తున్న బ్లాక్ మనీతోనే పబ్బం గడుపుకుంటున్నాయి. ఫలితంగా ఫలానా వ్యక్తి ఏ పాపం చేసినా, ఏ నేరానికి పాల్పడినా కనీసం స్క్రోలింగ్ లో కూడా చూపడంలేదు. మరి వీళ్లనేమనాలి? వీళ్లకు నీతి వాక్యాలు ఎవరు చెప్పగలరు?