ఆర్మీ – ప్రభుత్వం ఎవరిపట్టు ఎంత?


 ఈ మధ్య ఒక ఎస్ఎంఎస్ బాగా స్ప్రెడ్ అవుతోంది.
 అదేమిటంటే...

పాకిస్తాన్ లో సైనికదళ ప్రధానాధికారి ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు, అదే ఇండియాలో ప్రభుత్వమే ఆర్మీ చీఫ్ పదవికాల వయసును నిర్ణయించేస్తుంటుంది.
భారత్ , పాకిస్తాన్ కు ఇంచుమించు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగంలోనూ, సైనిక దళాధికారుల కదలికల్లోనూ చాలా తేడానే ఉంది. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఎస్ఎంఎస్ అందుకే అలా చురకవేసింది.
సైనికదళ ప్రధానాధికారి విజయ్ కుమార్ సింగ్ పదవీ విరమణ వయసు విషయంలో సుప్రీంకోర్టుదాకా వెళ్లాల్సి రావడంతో బ్యూరోక్రసీ, మిలటరీ ఆఫీసర్స్ మధ్య అంతరం పెరిగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి.
మనదేశంలో ఆర్మీపై రాజకీయనాయుకుల, అధికారగణ ప్రభావం ఉంటూనేఉంది. అయితే, శ్యామ్ మానెక్ షా, కె. సుందర్జీ వంటివారిని మినహాయిస్తే, సైనికదళ ప్రధానాధికారలపై బ్యూరోక్రాట్లు, నేతల పెత్తనం జరిగిందనే చెప్పాలి.
సివిలియన్ బ్యూరోక్రసీ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ఆర్మీ అధికారులు అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నారు.
ఆర్మీ జనరల్ వి.కె.సింగ్ వ్యవహారం చల్లబడిపోవచ్చు, కానీ, ఆర్మీ, బ్యూరోక్రసీ మధ్య ఏర్పడిన అఘాతం తొలిగిపోతుందని అనుకోలేం. రాజకీయ నాయకులు కూడా బ్యూరోక్రసీకే కొమ్ముకాస్తారు. ఫలితంగా మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా బ్యూరోక్రసీ చక్రం మరింత బిగుసుకోవచ్చు. చివరకు జరిగేది అదే…
ఆర్మీ అదికారులపై సివిలియన్ కంట్రోల్ ఏమేరకు ఉండాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మనదేశంలో ప్రజాస్వామ్య గాలులు బలంగా వీస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ తరహాలో ఉపద్రవాలు రాకపోవచ్చు. కానీ, పదేపదే పొరపాట్లు జరిగితే, మొలకెత్తే మనస్తాపాలు ఏటు దారితీస్తాయో చెప్పలేం.
చివరగా మరో విషయం ప్రస్తావించుకోవాలి. పందొమ్మిది వందల ఎనభైమూడులో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలోని ప్రభుత్వం లెఫ్ట్ నెంట్ జనరల్ ఎ.ఎస్.వైద్యను ఆర్మీ ఛీప్ గా నియమించింది. అయితే, ఈ క్రమంలో లెఫ్ట్ నెంట్ జనరల్ ఎస్.కె. సిన్హా సీనియార్టీని పక్కనబెట్టేసింది. దీంతో సిన్హా నిరసనగా తప్పుకోవాల్సివచ్చింది. ఆర్మీ చీఫ్ నియామకంలో సీనియార్టీని ఉల్లంఘించిన సంఘటన ఇదొక్కటే జరిగింది. అయితే, అది కూడా ఎందుకు జరిగిందన్న విషయంపై అప్పట్లో చెవులుకొరుక్కునేవారు. ఆ కథనం ఏమిటంటే, అమృత్ సర్ స్వర్ణాలయంలో సైనిక చర్యకు సిన్హా మద్దతు చెప్పలేదనీ, అందుకే ఆయకు ఈ ఉన్నతపదవి దక్కలేదని అనుకునేవారు.
– తుర్లపాటి నాగభూషణ రావు