చాలామంది అమెరికన్లు థాంక్స్ గివింగ్ రోజు టర్కీ తింటూ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేశారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఆ రోజు హాలిడే మూడ్‌లో లేరు. సోషల్ మీడియాలో (Truth Social) అమెరికా రాజ్యాంగాన్ని, ఇమ్మిగ్రెంట్లను టార్గెట్ చేస్తూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు.
అందులో కోపం ఉంది, వింత ప్రతిపాదనలు ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడా లేని కుట్ర సిద్ధాంతాలు (conspiracy theories) ఉన్నాయి. దేశాన్ని నాశనం చేస్తున్న వాళ్లు తప్ప మిగిలిన అందరికీ “హ్యాపీ థాంక్స్ గివింగ్” అంటూ మొదలుపెట్టి… “రివర్స్ మైగ్రేషన్” (Reverse Migration) కావాలంటూ ముగించారు.
ఇది కేవలం ఒక పొలిటికల్ స్టేట్‌మెంట్ కాదు; ఇంటర్నెట్‌లో దొరికే చెత్త పుకార్లన్నింటినీ కలిపి వండిన ఒక “కిచిడీ”. ఆ పోస్ట్ చూసి మీకు కన్ఫ్యూజన్ లేదా కోపం వచ్చి ఉంటే, అది సహజమే. కానీ ఆవేశపడకుండా, అందులో ఉన్న డేటా ఎంత వరకు నిజమో చూద్దాం.
ట్రంప్ చేసిన ఆ “వింత” ఆరోపణల వెనుక ఉన్న అసలు కథ ఇది:
1. “$50,000 ఉచితం” అనే పచ్చి అబద్ధం
ట్రంప్ మాట: “$30,000 సంపాదించే ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫ్యామిలీకి ప్రభుత్వం సుమారుగా $50,000 విలువైన బెనిఫిట్స్ ఇస్తోంది.”
అసలు నిజం: ఇది పూర్తిగా అబద్ధం. లెక్కల్లో గానీ, చట్టంలో గానీ దీనికి ఆధారం లేదు. ఇది 2017 నుంచి ఇంటర్నెట్‌లో తిరుగుతున్న ఒక “జాంబీ ఫేక్ న్యూస్”. కెనడాలో ఉన్న ఏదో శరణార్థుల ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చి అమెరికాలో జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
- చట్టం ఏం చెబుతోంది? గ్రీన్ కార్డ్ (Legal Permanent Residents) వచ్చిన కొత్తలో, మొదటి 5 ఏళ్ల పాటు ఫుడ్ స్టాంప్స్ (SNAP) లాంటి ఫెడరల్ బెనిఫిట్స్ తీసుకోవడానికి వీలు లేదు.
- అక్రమ వలసదారులు: వీళ్లకు అసలు ఏ ఫెడరల్ వెల్ఫేర్ రాదు. తక్కువ జీతం వచ్చే కార్మికులకు ప్రభుత్వం $50,000 చెక్కులు రాసిస్తోంది అనుకోవడం కేవలం ప్రజల్లో కోపం పెంచడానికే తప్ప నిజం కాదు.
2. “అందరూ నేరస్తులే” అనే అపోహ
ట్రంప్ మాట: అమెరికాలో ఉన్న 53 మిలియన్ల విదేశీయుల్లో చాలామంది “జైళ్ల నుంచి, పిచ్చాసుపత్రుల నుంచి, డ్రగ్ కార్టెల్స్ నుంచి వచ్చినవాళ్లే” అని, వాళ్ళ వల్లే సమాజం పాడైపోతోందని అన్నారు.
అసలు నిజం: అమెరికాలో విదేశీయుల జనాభా ఎక్కువ ఉన్న మాట వాస్తవమే. కానీ వాళ్ళు నేరస్తులు అనడం ముమ్మాటికీ తప్పు.
- క్రైమ్ రేట్: స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కాటో ఇన్‌స్టిట్యూట్ చేసిన రీసెర్చ్‌ల ప్రకారం, ఇక్కడ పుట్టిన అమెరికన్ల కంటే, వలస వచ్చిన వాళ్ళే (లీగల్ లేదా ఇల్లీగల్) చాలా తక్కువ నేరాలు చేస్తారు.
- పని: వలస వచ్చిన మగవాళ్ళు జైళ్లలో లేరు, పనిలో ఉన్నారు. గణాంకాల ప్రకారం లోకల్ వాళ్ళ కంటే ఇమ్మిగ్రెంట్లే ఎక్కువగా జాబ్స్ చేస్తున్నారు (66%).
3. మిన్నసోటాపై కక్కిన విషం,
ట్రంప్ మాట: మిన్నసోటాలో “సోమాలియన్ గ్యాంగ్స్ రోడ్ల మీద తిరుగుతూ జనాల్ని భయపెడుతున్నాయని”, అక్కడి కాంగ్రెస్ ఉమెన్ ఇల్హాన్ ఒమర్ “తన సొంత తమ్ముడిని పెళ్లి చేసుకుందని” ఆరోపించారు.
అసలు నిజం: ఇది ఒక వర్గాన్ని టార్గెట్ చేసి భయపెట్టడమే.
- సోమాలి సక్సెస్: మిన్నసోటాలో సోమాలి కమ్యూనిటీ వేల సంఖ్యలో చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది తప్ప, గ్యాంగ్ వార్స్ చేయడం లేదు.
- బ్రదర్ రూమర్: ఇల్హాన్ ఒమర్ తన తమ్ముడిని పెళ్లి చేసుకుందనేది సోషల్ మీడియాలో పుట్టిన అతి పెద్ద ఫేక్ న్యూస్. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని ఫ్యాక్ట్ చెకర్స్ ఎప్పుడో తేల్చేశారు.
4. “ఆటోపెన్” (Autopen) కుట్ర సిద్ధాంతం
ట్రంప్ మాట: “బైడెన్ ఆటోపెన్ (సంతకం పెట్టే మిషన్) ద్వారా సైన్ చేశారు కాబట్టి, ఆ లక్షల మంది అడ్మిషన్లు చెల్లవు, వాళ్ళందరినీ తీసేయాలి.”
అసలు నిజం: ఇది వింటే నవ్వాలో ఏడవాలా తెలియదు. ప్రెసిడెంట్ స్వయంగా పెన్ను పట్టుకుని పేపలర్ల మీద సంతకం పెడితేనే వీసా చెల్లుతుందా?
- ప్రాసెస్: వీసాలు, గ్రీన్ కార్డులు అనేవి ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలు (USCIS, State Dept) ప్రాసెస్ చేస్తాయి. ప్రెసిడెంట్ కూర్చుని 30 లక్షల ఫామ్స్ మీద సంతకాలు పెట్టరు.
- లీగల్: “ఆటోపెన్” వాడటం అనేది దశాబ్దాలుగా వస్తున్న ప్రభుత్వ పద్ధతి. అది చట్టబద్ధమే. ఒక మిషన్ సంతకం పెట్టిందని చెప్పి లక్షల మందిని దేశం నుంచి వెలేయలేం.
చివరగా: “రివర్స్ మైగ్రేషన్” (Reverse Migration)
ట్రంప్ చివరగా కోరుకుంటున్నది “రివర్స్ మైగ్రేషన్”. అంటే సింపుల్ గా చెప్పాలంటే “మాస్ డిపోర్టేషన్”. సిటిజన్ షిప్ వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి పంపించేయడం (Denaturalization).
ఇది ఏదో పాలసీ పేపర్ కాదు, ఇంటర్నెట్ పుకార్ల పుట్ట. ఇమ్మిగ్రేషన్ మీద చర్చ జరగాల్సిందే, కానీ ఇలాంటి పచ్చి అబద్ధాల ఆధారంగా కాదు.
Be the first to comment on "“53మిలియన్ల క్రిమినల్స్”: ఇమ్మిగ్రంట్ల పై విషంగక్కిన ట్రంప్!"