ఈవేళ (జనవరి 24) జాతీయ ఆడశిశువుల రోజు. అంటే గళ్ చైల్డ్ డేగా జరుపుకుంటున్నాం. మహాలక్ష్మి మా ఇంటపుట్టింది అని గర్వంగా చెప్పుకునే రోజులు అంతరించిపోతున్నాయి. మహాలక్ష్మీ మా ఇంటికి రాకురాకు అనే రోజులు వచ్చేశాయి. మరి ఈ పరిస్థితి ఎలా మారుతుంది. దేశంలోని ఇరవైరెండు 22 రాష్ట్రాల్లో , నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆడశిశువుల సంఖ్య ఆందోళనకరమైన స్థాయికి పడిపోయింది. హర్యానాలో అతితక్కువగా ఆడపిల్లులు పుడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అక్కడ ప్రతి వెయ్యిమంది మగశిశువులకు 830 మంది ఆడపిల్లలు పుడుతున్నారు.
శిశు లింగనిర్ధారణ పరీక్షలు నిషేధించినా అవి ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూనే ఉన్నాయి. మరి పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించే పీసీ, పీఎన్డీటీ చట్టం కింద ఏర్పడిన కేంద్ర పర్యవేక్షణ బోర్డు ఆడశిశువుల పట్ల వివక్షతను అంతం చేసేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నది. లింగనిర్ధారణకు ఉపయోగించే పరికరాలు దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.