ట్రంప్ ఓటర్లకు, అభిమానులకు నా బహిరంగ లేఖ*
-అమెరికన్ దేశీ మోహన మురళీధర్
Nov 10, 2024 (revised Nov 24, 2024)
*మినహాయింపులున్నాయి (Exceptions Apply)
అమెరికా ఎన్నికలు ముగిసాయి. నేను ఊహించని రీతిలో ట్రంప్ గెలిచాడు. ఇది నిరుత్సాహమైన ఫలితం అని అంటే – అది నా నిజమైన మనోభావాలను తక్కువ చేసి మాట్లాడడమే అవుతుంది.
ఎన్నికల ముందు నే చెప్పిన జోస్యం – కమల తప్పకుండా పెద్ద మెజారిటీ తో గెలుస్తుంది, ట్రంప్ హీనంగా ఓడిపోతాడు అని. ఇది ఆధారాల పరిశీలనతో (data analysis) చెప్పిందే కానీ, ఊహల ఉయ్యాలలో ఊరేగుతూ చేసింది కాదు.
ఆ జోస్యం ఘోరంగా తప్పింది. చెప్పానుగా, కాకి మాంసం తింటాను అని! తిన్నాను (అక్షరాలా కాదులెండి.)
ట్రంప్ కు ఓటు వేసిన పౌరులకు, అతన్ని సమర్ధించిన greencard వారికి, తదితర భారసంతతి ప్రజలకు నాదో విన్నపం, ఈ నా సందేశం. పందెంలో మీ గుర్రం గెలిచింది. అందుకు, మీకు నా అభినందనలు! సంతోషపడండి! పండగ చేసుకోండి!
కానీ, గెలిచింది మీరు! ఆ విజయంలో కూడా ఎందుకండీ మీకు అంత క్రోధం? అంత ఆక్రోశం? అంత కసి? ఆ ఏహ్యతా భావం? ఆ ఏవగింపు? మీ గుండె నిండా ఎందుకంత ఆ ద్వేషం?
ఈ లేఖను వీడియో రూపంలో ఇక్కడ చూడొచ్చు. |
ఇప్పుడు 2024 లోనే కాదు, 2016 లో ట్రంప్ గెలిచినప్పుడు కూడా మీ ధోరణి అదే! మీరు ఒప్పుకోరు కానీ సగం దేశానికి ప్రపంచానికి ప్రస్ఫుటంగా కనబడుతున్న వాస్తవం ఇది. అంతేకాదు, 2020 లో మీ అభ్యర్థి ఓడినప్పుడు ఏం చేశారు మీరు? మీలో 50 శాతానికి మిన్న ఓటమి ఒప్పుకోలేదు – అప్పుడేకాదు, ఇప్పటికీ! ఓటమిలోకూడా కూడా, మీలో అదే క్రోధం, అదే కసి! అదే ద్వేషం. అదే ప్రతీకార భావం. అంతేకాదు – చాలామంది ట్రంప్ అభిమానులు, అనుచరులు ఆవధులు దాటి హింసాకాండకు దిగారు రెండువేల ఇరవై ఒక్క సంవత్సరం జనవరి ఆరోరోజున .
మీరిచ్చిన, ఇస్తున్న సందేశం మీకై మీకు అర్ధం అవుతోందో లేదో, కానీ ట్రంప్ వ్యతిరేకులకు మాత్రం చాలా బాగా అర్థం అవుతోంది. పదేళ్లుగా ట్రంపిజం బంధుమిత్రుల సంబంధాలను చిన్నాభిన్నం చేస్తోంది మీకు మీ బంధుమిత్రుల కన్నా, సగం దేశ ప్రజల కన్నా ట్రంప్, ట్రంపిజం మిన్న! మీకు అర్ధం అవ్వాలన్న తహతహ తో నా సహ ట్రంప్ వ్యతిరేకుల తరపున ట్రంప్ మద్దతుదారులు ప్రపంచానికి ఇస్తున్న సందేశం నేను తెలుగులో విడమరుస్తాను.
మొత్తం ముగ్గురు పెళ్ళాలు, రద్దైన రెండు పెళ్లిళ్లు. ప్రతి పెళ్ళాంతో కాపురం చేస్తుండగానే వివాహేతర సంబంధాలతో లజ్జా రహితంగా లైంగిక సంపర్క స్వైరవిహారం చేసిన వెధవ వాడు. ఇలాంటివాడు మీలో చాలామంది దృష్టిలో కుటుంబ విలువలున్న ఉత్తముడు! ఎదురడిగితే , “ఎవడు పత్తిత్తు” అంటారు మీరు. దేవుడు వింతైన విధానంలో లోపభూయిష్టులను తన ప్రతినిధిగా పంపుతాడు – అంట. అంటారు క్రైస్తవులు చాలామంది అందుకే అలాంటి వారికి ట్రంప్ ఒక దైవ దూత!
E. జీన్ కార్రోల్ మీద అత్యాచారం చేసాడని న్యాయస్థానంలో ఆధారాలతో నిరూపించినా- ఒకటి కాదు, రెండు జ్యూరీలు ఒప్పుకుంటూ తీర్పు ఇచ్చినా మీకది అప్రస్తుతం. లేక, మీ దృష్టిలో అది చెల్లని తీర్పు.
దేశరక్షణకు సంబంధించిన పధకాలు, పత్రాలు దొంగిలించుకుపోయి, ఎవరికి చూపాడో, ఎవరికీ అమ్మాడో తెలీదు. దేశం ఎంత నష్టపోయిందో తెలీదు. ఈ రాజద్రోహానికి వాడిని పట్టుకొని కోర్టుకీడ్చితే, అదంతా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ రాజకీయ ఎత్తుగడ గొప్ప అని తీసి పారేస్తారు మీరు.
ట్రంప్ యూనివర్సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ‘మీరు సులువుగా సంపన్నులు కండి’ అంటూ ప్రచారం చేసి, కూటికి గూడుకి పనికిరాని పాఠాలు చెప్పి, పనికిమాలిన పట్టాలిచ్చి కోట్ల ప్రజల నుండి ఎన్నో వేల కోట్ల డాలర్లు దిగమింగిన దగుల్భాజీ ట్రంప్. పర్యవసానం గా న్యూయార్క్ న్యాయవ్యస్థ 25 మిలియన్ డాలర్ల జరిమానా వేస్తె, నోర్మూసుకొని కట్టాడు వాడు. అయినా వాడు మీకు నీతికి నిలబడే నిజాయితీ పరుడు. ట్రంప్ ఒకటి కాదు, రెండు కాదు – ఆరు సార్లు దివాళా తీసాడు అందునా నష్టాలెరుగని కెసినో వ్యాపారంలో! అయినా కానీ వాడు మీ దృష్టిలో గొప్ప వ్యాపార దక్షత ఉన్నవాడు.
హన్నన్నా, పన్నులు ఎగ్గొట్టడమే కాదు ఖాతాలు తిరకాసు చేసి ప్రభుత్వ ఖజానాల నుంచి రొఖ్ఖం దొంగిలించిన వాడి దోపిడీకి మీకు మీరిచ్చుకొనే సంజాయిషీ – ‘అదంతా అతని తెలివితేటలకు నిదర్శనం.’ ఆపైన “అవకాశం వస్తే ఎవడు చెయ్యడు?” అంటూ సమర్ధింపులు. తనను అభిమానించి ఆరాధించే ప్రజలకే పనికిరాని పిచ్చి టోకెన్లను, అసహ్యమైన పాదరక్షలను, నకిలీ వాచీలను, చిల్లి గోచీలను – అంతే కాదు తన ఆమోద ముద్ర వేసి దైవ వాక్యాన్నే అమ్మి సొమ్ముచేసుకొనే ఆ నీచుడు మీకు ఆరాధ్య దైవం!
కోటలు దాటే మాటలు వాడివి. వాడికి నోటి దురుసు. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేది పైశాచిక ప్రేలాపనలు. వాడికి హద్దులు లేని క్రోధం, అవధులు లేని అహంకారం. “తానే దేశం, దేశమే తను” అన్న మనఃస్తత్వం వాడిది. క్రూరత్వం వాడికి ఉగ్గుపాలతో అబ్బింది. నిరంతరం పగ, ప్రతీకార జ్వాలలతో రగిలే కుళ్ళుబోతు వాడు. ఇలాంటి లోపభూయిష్టమైన ఆ ధూర్తుడు, ఆ అజ్ఞాని మీకు ఆదర్శ పురుషుడు!.
ముప్పై వేలకు పైగా అబద్ధాలు చెప్పాడని రుజువులు చూపినా అది మీకనవసరం. “ఫేక్ న్యూస్ మీడియా!” మీ ఊతపదం. అతడి అడ్డగోలు మాటలకు, మీకు మీరిచ్చుకొనే సంజాయిషీ, మాకు చేసే ప్రబోధ – “ట్రంప్ ఉన్నది ఉన్నట్లు చెబుతాడు!” ఒకవేళ అతని మాటలు మీ నమ్మకాలకు విరుద్ధంగా ఉంటె, “అహ, ఠాట్, అతని ఉద్దేశం అదికాదు, ఇది. నువ్వే అతని మాటలు వక్రీకరిస్తున్నావ”ని మాకు బోధ చేస్తారుమీరు.
అసలు మీకు మీరే మొదటగా తేల్చుకొని నాన్చకుండా ఈ రెండు ప్రశ్నల కు సమాధానం చెప్పండి:
మొదటిది. వాడు మనస్సులో ఉన్నదున్నట్లు నిష్కర్షగా చెబుతాడా? లేక
రెండోది.. వాడి మాటలకు, వాడి అర్ధం అదికాదా?
ఈరెండు ప్రశ్నలకూ మీ సమాధానం అవుననేకదా? ఒకటికి రెండు – రెంటికి ఒకటి వ్యతిరేకం. ఇంత చిన్న విషయం మీ కెందుకర్ధం కాదు మహాప్రభో? కాదని మీరన్నా, నిజంగా కాకున్నా, మీరు అతడిని సమర్ధించే కారణాలు వేరంటారు. అదేమంటే అతడి ప్రవర్తన కాదు పాలసీలు నాకిష్టం అంటారు.
ఏమిటి వాడి బోడి పాలసీలు? బిలియనీర్స్ బేజో స్ లాంటి బోజోలకు, మస్క్ లాంటి పుస్కీలకు పన్నులు సడలించడం మంచి పాలసీ అని మీకనిపించిందా? లేక ఎదో ఒకనాడు మీరూ ఒక బిలియనీర్ అవుతారన్న నమ్మకంతో అది మంచి పాలసీ అంటున్నారా? గోడ వాడు కట్టింది లేదు, అందుకు మెక్సికో డబ్బుకట్టింది లేదు. వాడి హయాంలో వలసలను అరికట్టింది అంతకంటే లేదు.
ఆడవారికి వారి దేహం పైన హక్కు లేకుండా తొలగించిన ముగ్గురు అమెరికన్ తాలిబాన్ సుప్రీమ్ కోర్ట్ న్యాయవాదులను నియమించి – తద్వారా వాడు సగం దేశ ప్రజలను రెండవ స్థాయిపౌరులుగా దిగజార్చినా కా
రాష్ట్రాల హక్కు పేరుతో చరిత్రలో మరోసారి మానవహక్కులు అణచిన సమయం ఏమిటో తెలుసా? చట్టబద్ధమైన బానిసత్వం! Legal Slavery. ఆ బానిసత్వ నియంత్రణ హక్కులకోసం దక్షిణాది రాష్ట్రాలు ప్రకటించిన అంతర్యుద్ధం! Civil War!
బ్రతుకుతెరువుకోసం అమెరికా రావాలనుకొంటున్న, వస్తున్న వారు అందరూ చట్టబద్ధంగా రావాలి. ఇది నావాదం. నేనలానే వచ్చానిక్కడకు. కాందిశీకులు ఆశ్రయం కోరడం కోసం అమెరికా దేశం చేసిన బాసలు, రాసిన చట్టాలు దురుపయోగం చేస్తున్నారు చాలామంది తామూ కాందిశీకులమన్న వంకతో. అంతే కాదు, చట్టాలు ఉల్లంఘిస్తున్నారు చాలామంది.
ఇది పచ్చి నిజం. చట్టవిరుద్ధమైన వలసలను తప్పకుండా అరికట్టాలి. ఇది కూడా నా వాదం.
కానీ, చట్టవిరుద్ధంగా వచ్చినప్పటికీ వాళ్ళూ మనుషులే. మీలాంటి, నాలాంటి మనుషులే. బతుకుతెరువు కోసం వచ్చిన వారంతా నేరస్తులు, దోపిడీదారులు, హత్యలు చేసేవారు, స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు అనేది మీ నాయకుడు ట్రంప్ వాదం. అదే మీ వాదం మీది కూడా అయితే, మీరు ఆత్మ పరిశీలన చేసికోవాల్సిన
నేను తెలుగులో చెప్పే ఈ ఘాటు పదాలు మీకర్ధం అయితే, మీరు అమెరికా పౌరులు అయితే, మీరూ నాలాగా అమెరికా కు వలస వచ్చిన వారు అయివుంటారు . నేను వలసను. మీరు వచ్చింది వలసగా. ఇది మన అలవరుస. It’s our wavelength.
మీరు తినే ఇండియన్ రెస్టారెంట్ లో పనిచేసే భారతీయులంతా చట్టబద్ధంగా పని చేస్తున్నారో లేదో తెలుసుకోండి.
పందెం కడతాను – no. they are not. Indians అందరూ చట్టబద్ధంగా ఉండటం లేదు అమెరికా లో. అసలు immigration ను పూర్తిగా వ్యతిరేకించే మనలాంటి వలసలు యేరు దాటి తెప్పను కాల్చే రకం. అలాంటి వారు తమ పంథాకు సిగ్గు పడాలి.
ఒక మిత్రుడు, ట్రంప్ ఓటర్, రెచ్చి పోయి క్రోధంతో అన్నాడు – ఈ “లిబెరల్ నా కొడుకులు ఎవరు నాకు చెప్పడానికి?” అని. ఆయన వైపుకు ఏ రైట్ వింగ్ వ్యాఖ్యాత మాటలు చేరాయో నాకు తెలీదు. కానీ, “liberals, commies, radical leftists” లాంటి పతకాలు, అంటే labels, మిడిమిడి జ్ఞానంతో చేసే ఆరోపణలు.
మీకు తెలీకుండానే మీ మీద దు ష్ప్ర చారుల ప్రభావం చాలా ఉందని నా సిద్ధాంతం. వాళ్ళు చిత్తశుద్ధి లేని శివభక్తులు.
కాదు ట్రంప్ భక్తులు. ట్రంప్ శివుడు కాదు – ఒక రాక్షసుడు. ట్రంపిజం అనేది సగం దేశాన్నివశం చేసుకున్న ఒక రాక్షసశక్తి.
ఆ దుష్ప్రచారమే దాని ఆయుధం. దుష్ప్రచారకుల విషయానికొస్తే, ఒకప్పుడు right wing వ్యాఖ్యాతలు రేడియో లో టీవీ లో చేసిన ప్రసంగాలు బాగానే వినేవాడిని నేను. మొదట వాళ్ళ వాదనలు సమంజసంగానే అనిపించినా, ఏ ఒక్కడి వాగుడు కొన్ని నెలల కంటే సహించలేక పోయేవాడిని. దానికి కారణం? నాకు తెలిసిన నిజానికి విరుద్ధంగా చెప్పడం వల్లనో, నిజాన్ని వక్రీకరించడం వల్లనో, వాళ్ళ ఆగ్రహానికి అర్థం లేదనిపించడం
వచ్చే వారమే అమెరికాలో Thanksgiving. సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసే బంధువులు, మిత్రులు సందడి సందడిగా మాట్లాడుకునే తరుణంలో వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు రాజకీయాలు ప్రస్తావిస్తారు. క్రోధంతో రెచ్చిపోయి ప్రసంగాలిస్తారు. తప్పించుకునేందుకు చూసే వాళ్ళు ఈ క్రేజీ అంకుల్ తో ఎందుకని గమ్మున కూర్చింటారు.
ఎవరా క్రేజీ అంకుల్స్?
వాళ్ళు చూపేది కోపం, వాళ్ళు నమ్మేది, విరజిమ్మేది కుట్ర సిద్ధాంతాలు. ఉదాహరణకు ఒక క్రేజీ అంకుల్ అనొచ్చు “Vince Foster ను మాత్రమే కాదు, హిల్లరీ క్లింటన్ మరింకెంతమందినో చంపించిందంట.” ఈ ఉదాహరణలో రెండు కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది ఖచ్చితంగా నిజమే అని చెప్పడం, అంటే, – matter of factly: విన్స్ ఫాస్టర్ ను హిల్లరీ క్లింటన్ చంపించింది. రెండవది, “ఇంకెంతమందినో చంపించింది” అంట అనడంలో కొంత అనుమానం వ్యక్త పరచడం. అంటే, తనకు ఓపెన్ మైండ్ ఉన్న దనీ, విన్నవన్నీ తాను పూర్తిగా నమ్మను అనీ చెప్పుకోవడం అన్న మాట.
అంతే కాదు, జాతి వివక్షతాభావాలు వారి ఆస్తి , వాళ్లంటారు “ఈ నల్ల వాళ్ళంతా పని దొంగలు.” వారు వ్యక్తపరిచేది బూజు పట్టిన భావాలు. “ఇంట్లో కూర్చొని వంటలు చేసుకొంటూ పిల్లల్ని చూసుకోకుండా నీకెందుకమ్మా ఉద్యోగం?” ఇలాంటి బూజు పట్టిన భావాలు వ్యక్తీకరించింది మరెవరో కాదు JD Vance. మన ముద్దుల తెలుగింటి అల్లుడు, అమెరికా కు త్వరలో కానున్న ఉపాధ్యక్షుడు!
బహిరంగ లేఖ పేరుతో పైత్యం చాలానే చూపాను. ఇక నా ముగింపు మాటలు.
గెలిచింది కనుక మీది రేసు గుర్రం అని మీరు నమ్ముతున్నారు. గెలిచింది సరే, అది prosthetics అలంకరించిన బక్కద, కుంటి, గుడ్డి, పిచ్చిపట్టిన మదపు గుర్రం అని నేనంటున్నాను. నా ఉద్దేశంలో ఎన్నో రోజులు పట్టదు మీకు మీరో గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారిన్నాళ్ళూ అని. కాలక్రమంలో ట్రంప్ ను సమర్ధించి తప్పు చేశారన్న నిజం తెలుసుకుంటారు అనుకుంటున్నాను.
కానీ అది ఒప్పుకుంటారు అనుకోను. మనందరి భవిష్యత్తుకోసం, నా అంచనాలు మళ్ళీ తప్పయితే మంచిదే. అలానే అయితే నాలుగేళ్ళ తర్వాత మనఃస్పూర్తి గా ఒప్పుకుంటాను.
ట్రంప్ ను వ్యతిరేకించిన సగం దేశం విలపిస్తోంది. వాళ్ళ పుండు మీద కారం చల్లకండి. నాకు పర్లేదు – నా తోలు మందం.
నేను రోటిలో తలపెట్టింది రోకటి పోటుకు వెరసి కాదు. మీ నిష్టూరాలు, ఈసడింపులు నేను పడగలను. ట్రంప్ వ్యతిరేకులైన బంధుమిత్రుల కోసమైనా మీరు క్రేజీ అంకుల్ కాకండి. మీరు గెలిచారు ఆనంద పడండి. అంతటితో ఆగండి.
ఒక ప్రక్క నా మనసు చెబుతోంది – అదే మీ నైజం అయితే అసలు ట్రంప్ ను సమర్ధించే వారు కాదు అని. కానీ, నాలోని ఆశావాది అంటున్నాడు, మీరు అర్ధం చేసుకోగలరు, అని!