15-Jul-2008
ఆ వారం నాది నైట్ షిఫ్ట్. ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని మా మేనేజర్ సాయంత్రం ఆరింటికే రమ్మన్నాడు.
ఏడున్నర, ట్రైనింగ్ అయిపోయి సీట్ దగ్గరకి వచ్చా. ఎమన్నా పనికొచ్చే మెయిల్స్ ఉంటాయేమో అని చూస్తుండగా, మేస్సేంజేర్ విండో ఫ్లాష్ అయింది. చూస్తే సునీత.
నేను లేకపోయేసరికి రోజంతా బోర్ కొట్టిందట… సాయంత్రం నన్ను చూసి ప్రాణంలేచివచ్చింది అని చెప్పింది. దేవుడా!! తను నాగురించి ఆలోచిస్తుందా?? గుడ్… బాగుంది.
అంత బాగానే నడుస్తోంది… రోజురోజుకి ఆ అమ్మాయి మీద నా ప్రేమ పెరుగుతూ పోతోంది. పదిహేను రోజులు గిర్రున తిరిగాయి… ఆ రోజు మధ్యాహ్నం లంచ్లో బ్లూ కలర్ అంటే నాకు ఇష్టం అని చెప్పా… ఏదో అలా అన్నా, అన్న సంగతే నాకు గుర్తు లేదు తెల్లారి తనను చూసేవరకు. ఆశ్చర్యం. తెల్లారి తను బ్లూ డ్రెస్ లో జలకన్యలాగ మెరిసిపోతూ వచ్చింది. నా కలలరాణి నాకిష్టమైన బ్లూ డ్రెస్ లో. ఇంతకంటే ఇంకేంకావాలి చెప్పండి 🙂 సాయంత్రం టీ బ్రేకులో తనకి చెప్పా ఆ డ్రెస్ చాల బాగుంది అని… పిచ్చి పిల్ల,నా డ్రెస్ బాగుంది కానీ బాగాలేనా అని ఓ తెగబాధపడిపోయింది. తనకి సర్దిచేప్పేసరికి తాతలు దిగొచ్చారు.
నాకసలు నమ్మబుద్ధి కావడంలేదు… ఏ గొడవలు లేకుండా, ఏ చికాకులు లేకుండా సాగిపోతుంది అది నా జీవితమేనా అని. ఎస్, అది నా జీవితమే అని ఒక సంఘటన ఋజువు చేసింది.
ఒకరోజు నేను నైట్ షిఫ్ట్ లో ఉండగా, సునీత ఫోన్ చేసింది… మార్నింగ్ షిఫ్ట్ లో తను ఉన్నప్పుడు ఏదో కోడ్ ప్రొడక్షన్ టీం వాళ్ళకి ఇచ్చిందట… దానిలో ఏవో తప్పులు ఉన్నాయి అవి మైగ్రేట్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని. రేప్పొద్దున ఏమవుతుందో అని తెగ ఖంగారు పడుతుంటే, నేనున్నా అంతూ అభయహస్తం ఇచి ఆ వివరాలన్నీ తీసుకున్న.
ఆడవారి మాటలకుఅర్ధాలే వేరులే సినిమా లో వెంకటేష్ లాగ బుక్స్ చూస్తూ, నెట్ లో ఆన్లైన్ హెల్ప్ చూస్తూ ఆ ఇష్యూ ఫిక్స్ చేశా. ఇంటికి వెళ్లేముందు సునీత కి ఒక మెయిల్ పెట్టి “చిన్న చిన్న వాటికీ ఖంగారు పడకు” అని ఒక ఉచిత సలహా కూడా పడేసా.
తరువాతి రోజు కొంచెం పని ఉండి నేను ఆఫీసుకి లేట్ వెళ్ళా. సాధారణంగా ఎనిమిదింటికి వెళ్ళిపోయే సునీత ఆ రోజు నాకోసం (ఎస్, నాకోసమే) ఎదురుచూస్తూ ఉండి.
వస్తూనే కళ్ళెగరేసి ఒక చిలిపి నవ్వు నవ్వా. దానికి తను కళ్ళతోనే అందంగా బదులిచ్చింది. ఇంతలో రాకేశ్ గదికి ఏదో పని ఉండి నా సీట్ దగ్గరికి వచ్చాడు… వాడి పని ఒక 10 నిముషాలు పట్టింది… వాడు వెళ్ళే దాక సునీత నాకోసం ఎదురుచూస్తూ ఇబ్బంది ఫీల్ అవడం నా చూపుని దాటిపోలేదు. వాడు వెళ్ళగానే, ఒక్క అంగలో నా దగ్గరకి వచ్చి, నా చెయ్యిపట్టుకోని చిన్నగా నొక్కి వదిలింది. అదే మొదటిసారి నా చేతిని తను పట్టుకోవడం. తనమొహం వెయ్యి వోల్టుల బల్బులా మెరుస్తుండగా, “థాంక్స్ సుబ్బు, నువ్వేలేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో… నీ మేలు ఈజన్మలో మర్చిపోలేను. నీకో సంగతి తెలుసా? నిన్ను ఎప్పుడు చూసినా నా సొంత తమ్ముడిని చూసినట్టు ఉంటుంది. మొదటిసారే నాకు నువ్వు బ్రదర్ అనే ఫీలింగ్ ఏర్పడింది. మా తమ్ముడు కూడా నీలాగానే చాలా సరదాగా, చిలిపిగా ఉండేవాడు. కానీ, వాడు ఇంటర్మీడియట్లో ఉండగా మలేరియా వచ్చి చనిపోయాడు. కానీ దేవుడు నీ రూపంలో వాడిని మళ్లీ నాకు ఇచ్చాడు. థాంక్స్ రా… నువ్వు చేసిన సహాయానికే కాదు, అన్నింటికీ కలిపి చాలా పెద్ద థాంక్స్…” అంది.
ఒక్క క్షణం నేను బిత్తరపోయా. ఏంటి? తమ్ముడా?? ఇంకేం కాదు!! నేనెప్పుడన్నా ఆమెని అక్కలాగా ట్రీట్ చేసానా అని ఒక్కసారి గుర్తుచేసుకున్నా… దేవుడా, ఈ భూమి ఎందుకింక పగిలిపోలేదు? ఆ ఆకాశం ఇంకా ఎందుకు పడిపోలేదు? ఇది వినదానికా నేను ఎగురుకుంటూ వచ్చింది?
ఛీ నా జీవితం… ఇంకా ఎన్ని చూడాలో!!
ఎప్పుడైతే ఏదో జరగబోతుంది అని ఎదురుచూస్తామో అది జరగదు…. ఎప్పుడైతే ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉంటామో, ఏదో ఒక ఉపద్రవం వచ్చిపడుతుంది.
ఆ రాత్రి 3 బీర్లు లోపలకి పంపి, సునీతను నా మనసులోనుండి బయటకు పంపా…
కానీ ఇదే చివర కాదని నాకూ తెలుసు 🙂
telugulo raasthunnaraa????? good going 🙂