అమెరికాను అమ్మకానికి పెట్టిన ట్రంప్

(ఇది సెప్టెంబర్ 19 న ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేసిన ప్రొక్లమేషన్, ఆ ప్రకటన, దాన్ని చేసిన విధానం సృష్టించిన గందరగోళం గురించి ఈనాడు లో నేను ప్రచురించిన అభిప్రాయాం – (OpED). ఇది నిడివి కోసం ఎడిట్ చేయని సంపూర్తి వెర్షన్.)

సెప్టెంబర్ 19 న అధిక నైపుణ్యం ఉన్న కొంతమంది విదేశీ ఉద్యోగులకుఇచ్చే H-1B  వీసాలపై $100,000 రుసుము విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక  ప్రకటన జారీ చేశారు. ఈ మార్పు వ్యాపార సంస్థలలో, వీసాదారులలో గందరగోళాన్ని సృష్టించింది అంటున్న విమర్శకులకు నేను చెప్పేది ఒకటే. ఈ ప్రకటన ను విధాన దృక్పథం తో చూడకూడదని. అలా కాకుండా దీన్నొక  రియాలిటీ టీవీ షో అనే కోణంనుంచి చూస్తే ఈ గందరగోళానికి వివరణ వస్తుందని నా మనవి. నాది వెటకారం అని మీకనిపిస్తే, అది నిజమే. చిత్తగించండి. 

“ది అప్రెంటిస్” 

(The Apprentice అనేది ఒక అమెరికన్ రియాలిటీ టెలివిజన్ షో. ఇందులో పోటీదారులు వ్యాపార సంబంధిత సవాళ్లలో పాల్గొంటారు. ఈ షో ముఖ్య ఉద్దేశ్యం, విజేతకు షో హోస్ట్ కంపెనీలలో ఒకదానిని నిర్వహించడానికి ఒక సంవత్సరం పాటు, $250,000 విలువైన కాంట్రాక్ట్ లభిస్తుంది. 2004 నుండి 2015 వరకు, ఈ షోకి డొనాల్డ్ ట్రంప్ హోస్ట్ గా ఉన్నారు. “యు ఆర్ ఫైర్డ్!” (You’re fired!) అనే ఊత పదం ద్వారా పోటీదారులను తొలగించడం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ట్రంప్ యొక్క ప్రజా ప్రతిష్టను రూపొందించడంలో, ఆ తర్వాత ట్రంప్ అధ్యక్షుడు కావడానికి కూడా ఈ షో కీలక పాత్ర పోషించింది.)

ది అప్రెంటీస్’ రియాలిటీ షో మాజీ హోస్ట్ ఈ శుక్రవారం ఎపిసోడ్ లో తన అత్యంత నాటకీయ ఘట్టాన్ని ప్రపంచానికి అందించారు. అమెరికా అధ్యక్షులవారి కొలువు, గొప్పబోర్డురూమ్‌ అయిన ఓవల్ ఆఫీస్ నుంచి ఒకే ఒక ధైర్యవంతమైన ప్రకటన తో (ప్రొక్లమేషన్ కు మరో పేరు రాజాజ్ఞ!), డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా కార్యక్రమాన్ని ఒక అత్యున్నత స్థాయి రియాలిటీ టీవీ షో ఎపిసోడ్ గా మలిచారు. ఈ ఎపిసోడ్ లో ఒక కొత్త, నివ్వెరపోయే సవాలు ఉంది: అదే $100,000 దరఖాస్తు రుసుము. మాన్ హాట్టన్  వీధుల్లో నిమ్మరసం అమ్మడం లాంటి ‘ది అప్రెంటిస్’ ఎపిసోడ్ లు మర్చిపోండి; సామర్ధ్యం ఉన్న యువతకు, అత్యంత ప్రకాశవంతమైన మేధస్సులకు వాళ్ళ అమెరికా కలలు పండాలంటే, ఇప్పుడు కొత్త పరీక్ష ఏమిటంటే అంతిమ అడ్డంకి గా ఈ లక్ష డాలర్ల దరఖాస్తు  రుసుంని దాటడమే.

“ఆ వ్యక్తి ఆ కంపెనీకి, అమెరికాకు ఎంతో విలువైనవారైతే (ఇక్కడే) ఉంటారు, లేదంటే వెళ్లిపోతారు, అప్పుడు కంపెనీ ఒక అమెరికన్ ను నియమిస్తుంది,” అని వాణిజ్య కార్యదర్శి అయిన హావర్డ్ లట్నిక్, ట్రంప్ కుడిభుజం గా నిలుస్తూ అన్నారు!  “ఇమ్మిగ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే: అమెరికన్లను నియమించుకోవాలి, మరియు లోపలికి వచ్చే ప్రజలు అత్యున్నత స్థాయివారు అయి ఉండాలి….” అని జోడించారు. వాణిజ్య శాఖకార్యదర్శికి ఇమ్మిగ్రేషన్ విధానంతో సంబంధం ఏమిటి అని చొప్పదంటు ప్రశ్నలు వేయకండి. వీసాలు అమ్మకానికి పెడితే, అది వాణిజ్యం కాదా? 

పాత H-1B లాటరీ, దానిని అమలు పరచిన మొండి, బ్యూరోక్రాటిక్ ప్రక్రియలతో, రేటింగ్స్‌లో వెనుకబడింది. కానీ, ఈ కొత్త షో, టీవీలో ప్రసారం చేయడానికి అర్హమైన సవాలు నాటకీయ ఉత్కంఠకు ఒక అద్భుతమైన ఎత్తుగడ. పోటీదారులు—ఆశావహులైన టెక్ స్టార్టప్‌లు, తెలివైన యువ ఇంజనీర్లు, మేధా సంపన్నులు—వ్యాపార సంస్థల CEO ముందు నిలబడతారు. తమ విలువ కనీసం $100,000 ఉంటుంది అని CEO ను ఒప్పించి ఆ సంస్థ చేత ఆ H-1B రుసుము కట్టించగల సామర్ధ్యం చూపడం, లేకపోతే తమను అప్పుల ఊబిలోకి నెట్టేసే విధంగా ఒక చెక్కును రాయగల వంటి స్వంత సామర్థ్యంపై ఈ పోటీదారుల భవిష్యత్తు  ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అమెరికా దేశపు తొలి CEO అధ్యక్షుని మహాద్భుతమైన వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు; ఇది అమెరికా పై నిజమైన విశ్వసనీయతకు ఒక పరీక్ష! ఇందులో ఉన్న ఒక అజ్ఞాత పరీక్ష ఏమిటంటే, అతి తీవ్రమైనది అనిపించే ఈ సవాలును, ఆ తదుపరి ఏర్పడ్డ గందరగోళాన్నిఎవరు తట్టుకుంటారో, వారు అమెరికా పై అంత మక్కువ చూపినట్లు అని షో నిర్వాహకులు అంటున్నారు. కన్నీళ్లు తెప్పించే ఒకే ఒక్క ఇన్‌వాయిస్‌తో “అమెరికాను మళ్లీ గొప్పగా చేయడం (Make America Great Again)” పట్ల ఎవరు నిజంగా కట్టుబడి ఉన్నారో చూపించే ఒక ప్రదర్శన.

ట్రంప్ ప్రకటన ముగిసింది. లైట్లు వెలిగాయి, కెమెరాలు రికార్డింగ్ చేస్తున్నాయి. ప్రకటన అనంతరం కొన్ని గంటల పాటు పోటీదారులు పడ్డ పాట్లు, కష్టాలు పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది ఈ రచించని రియాలిటీ షో లోని నిగూఢ ఆంతర్యం, దాని వినోదపు విలువలు. 

అంతా గందరగోళం

ట్రంప్ యంత్రాంగం విసిరిన  ఈ సవాలు సృష్టించిన గందరగోళమే ఈ ఎపిసోడ్ యొక్క రేటింగ్స్ అంత ఎక్కువ అవడానికి దోహదపడింది. ప్రకటనానంతరం వచ్చాయి ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రకటన కొత్త H-1B విసాలకు మాత్రమే వర్తిస్తుందా, లేక పాత విసాలకు కూడానా?  ప్రస్తుతం H-1B లో ఉన్నవాళ్లు అమెరికా విడిచి కొద్దీ రోజులు తిరిగి వస్తే ఈ రుసుము కట్టి మరీ రావాలా? స్టూడెంట్ విసా నుండి H-1B కు మారే వారికి  ఈ రూల్ వర్తిస్తుందా? వెంటనే  సమాధానాలు దొరకక షో మరింత రక్తికట్టింది.  

పెద్ద పెద్ద న్యాయవాదుల జట్టులున్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, JP మోర్గన్ (ఇలాంటి సంస్థలు ఈ షో లో పాత్రధారులే) వంటి సంస్థలకు కూడా ఇలాంటి జవాబు లేని ప్రశ్నలే. అందుకే, ఎందుకైనా మంచిదని తమ సంస్థల లోని H-1B ఉదోగులను (వీరంతా కూడా పాత్రధారులే) ఇమెయిల్ ద్వారా హెచ్చరించాయి: అమెరికా విడిచి వెళ్ళొద్దని, దేశాంతరాల్లో  ఉంటే ఆదివారం ఉదయం 12 గంటలకల్లా వచ్చేయండి అని. ఇలాంటి మెయిల్ చూసుకుని, లేక తత్సంబంధిత వార్తలు చూసి టేక్ ఆఫ్ కు సిద్ధమవుతున్న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి దుబాయి వెళ్లే ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఉన్న చాలామంది భారతీయులు, H-1B వీసా దారులు, ఖంగారు పడుతూ విమానం దిగిపోయిన వైనం వైరల్ అయిన  వీడియో ద్వారా మనకు తెలిసిందే. అలాంటి సంఘటనలు చాలామంది H-1B ఉదోగులకు మాసిపోయే గాయాలు కావచ్చు. కానీ, ప్రతి ఒక్క H-1B విసాదారునికి, వారి కుటుంబ సభ్యులకు సెప్టెంబర్ 19 శుక్రవారం నాడు నిద్ర లేచినప్పటి అమెరికా సెప్టెంబర్ 20 శనివారం నాడు నిద్ర లేచినప్పటి అమెరికా ఒకటి కాదు. మాయని గాయాన్ని రేపిన ఆ శుక్రవారం H-1B విసాలో ఉన్నవారెవరూ ఎప్పటికీ మర్చి పోరు. మర్చి పోకూడదు. 

అమెరికన్ ఉద్యోగాలను రక్షించే మార్గంగా చూపబడిన ఈ ప్రకటన, ఒక అద్భుతమైన వ్యాపార ఒప్పందం గా ట్రంప్ సన్నిహితులు కీర్తిస్తున్నారు. విమర్శకులు మాత్రం అందుకు భిన్నంగా ఇది చిన్న సంస్థలను శిక్షిస్తుంది, దిగ్గజాలను బహుమతిస్తుంది అంటున్నారు. ఆరు అంకెల ధరను పెట్టగలిగిన ప్రతిభ మాత్రమే విలువైనది అని ఇది సందేశాన్ని పంపుతుంది. అంతేకాదు ఆఫ్ షోరింగ్ ను ప్రోత్సహిస్తుంది అనికూడా అంటున్నారు. ప్రపంచంలోని మిగిలిన అత్యంత ప్రకాశవంతమైన మేధావుల సంగతేంటి? వారు తమ సంచీలను సర్దుకుని, తక్కువ పోటీ ఉన్న మార్కెట్‌కు వెళ్ళవచ్చు. “ది ఆర్ట్ అఫ్ ది డీల్” అనేది పరస్పర ప్రయోజనం గురించి కాదా? ఎవరిని గెంటేసినా అనవసరం, జగమంతా ‘గెలవడం’ గురించేనా? అసలు ఇక్కడ గెలవడానికి నిర్వచనం ఏమిటి?

రియాలిటీ షో పాఠం 

ఇంకా మరికొద్దికాలం భిన్న భాగాలు గా నడిచే  ఈ “H-1B రుసుము” ఎపిసోడ్ లు చూసి ప్రతి రియాలిటీ షో టీవీ నిర్మాత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మంచి రేటింగ్స్ రావాలంటే ముందుగా సవాలుతో గందరగోళం సృష్టించాలి. తర్వాత, గంటకొక ఉపప్రకటనలతో ఆ సవాలు వల్ల కలిగిన సందేహాలు తీర్చుతూ, అపోహలు సరిదిద్దుతూ జరిగే చోద్యాని వీక్షకుల ఆనందం కోసం వదిలేయాలి. ఇందుకు ఉదాహరణ ప్రకటన వెలువడిన 20 గంటలకు గాని కొత్త విధానం కొత్తవిసాలకు మాత్రమే వర్తిస్తుందని సవరణ చెయ్యక పోవడం. మరో ముఖ్యమైన విషయం  – ప్రకటన చేసినప్పుడు ట్రంప్ కు కుడివైపున నిలిచి $100,000 రుసుము ప్రతి వీసాకు ప్రతి ఏటా వర్తిస్తుంది అని రెండుసార్లు స్పష్టంగా చెప్పారు హావర్డ్ లట్నిక్. దాదాపు 24 గంటల తర్వాత కానీ ట్రంప్ పత్రికా కార్యదర్శి కారోలిన్ లీవిట్ $100,000 రుసుము ఏటేటా కాదని, ఒకే ఒక్క సారి అని నొక్కి వక్కాణించడం మరో ఉదాహరణ. ఇక్కడ ట్రంప్ యంత్రాంగం నేర్పుతున్న మరో పాఠం ఉంది. మీ వల్ల ఎన్ని అవకతవకలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు ఒప్పుకోవద్దు. అవకతవకలు జరిగితే, అదంతా పధకం లోని భాగమే అని దబాయించాలి. పాత్రికేయులు ఎవరన్నా నిలదీస్తే ‘ఫేక్ న్యూస్ మీడియా’ కు రియాలిటీ షో లోని లొసుగులు అర్ధం చేసుకునే ఇంగితం లేదని తీసికొట్టడమే సబబు. 

వీక్షకులు తమ తమ అభిమాన వీసా దారులు, వారి భవిషత్ యజమానుల కోసం, ఉత్కంఠగా జై కొడుతూ, ఉత్సాహ పరుస్తూ షో చూస్తున్నారు. అమెరికన్ ధనస్వామ్యంలో “టాప్ పెర్ఫార్మర్లు” అయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, NVIDIA, మెటా వంటి మద్దిగజాలైన సంస్థలు ఈ ఖర్చును భరించగలవు. వారికి ఇది ఒక చిన్న బడ్జెట్ సర్దుబాటు మాత్రమే! ఈ పందెంలో వారి విజయం ఖాయం అని పరిశీలకులు చెబుతున్నారు. కానీ బోస్టన్‌లో ఉన్న ఒక చిన్న బయోటెక్ సంస్థకు లేదా ఆస్టిన్‌లోని ఒక కొత్త AI స్టార్టప్‌కు, ఈ ప్రకటన ఆ రెండు విధిరాత పదాలను విన్నట్లే: “నువ్వు  తొలగించబడ్డావు! (యు ఆర్ ఫైర్డ్)” ప్రపంచ నైపుణ్యాన్ని అమెరికా గడ్డకు తీసుకొచ్చి కాన్సర్ కు మందు కనుగొనాలనుకొనే స్వప్న ప్రియుల కలలు కల్లలౌతాయి – నిపుణులు దొరకక కాదు, నిధుల కొరత వల్ల. ఇలాంటి వాదనలు ట్రంప్ ప్రభుత్వం పై విమర్శకుల కుట్ర పూర్తిత వ్యాఖ్యలు మాత్రమే అని గమనించండి!

అమెరికా ఆస్తుల అమ్మకం 

ఇక్కడ సందర్భోచితం ఉండే మూడు విషయాలు మననం చేసుకోవాలి. మార్చ్ నెలలో ప్రభుత్వాన్ని చిన్నదిగా చేసి, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో, ట్రంప్ పరిపాలన వందల కొద్దీ ఫెడరల్ భవనాలను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. అయితే, “అపారమైన ఆసక్తి” కారణంగా ఈ జాబితాను ఒక రోజు తర్వాత తొలగించింది. ఇప్పటి వరకు ఆ జాబితా ప్రసక్తి మళ్ళీ రాలేదు. ప్రభుత్వ భూములను అమ్మే ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వం వారి “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్” అనే ఒక పెద్ద శాసన ప్రయత్నంలో వివాదాస్పదమైన భాగం. ఆ భాగాన్ని తర్వాత తొలగించారు. ఫిబ్రవరి లో ధనవంతులైన విదేశీయుల కోసం ప్రతిపాదించబడిన ట్రంప్ గోల్డ్ మరియు ప్లాటినం కార్డులు వీసా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు, కార్పొరేషన్లు అమెరికా ప్రభుత్వానికి మిలియన్ల డాలర్ల “విరాళం” చెల్లించి, గ్రీన్ కార్డు కు త్వరగా మార్గాన్ని పొందవచ్చు. మరింత ఖరీదైన ప్లాటినం కార్డ్ (విలువ ఐదు మిల్లియన్ల డాలర్లు), విదేశీ ఆదాయంపై అమెరికా పన్నుల నుండి మినహాయింపును కూడా ఇస్తుంది. ఈ పధకాల ప్రసక్తి మొన్న H-1B రుసుము ప్రకటన చేసే వరకు మళ్ళీ రాలేదు! ఎందుకనో? ట్రంప్ ప్రభుత్వం వారు ప్రచారం చేసినట్లు గా ఈ వీసాల కు అంత గిరాకీ లేదేమో అనుకోవడంలో తప్పు ఉందా?   

గతంలో వచ్చిన ఈ  ‘అమ్మకపు’ ప్రకటనలతో కలిపి H-1B రుసుము ప్రకటన గురించి ఆలోచిస్తే, ట్రంప్ అమెరికాను అమ్మకానికి పెట్టారనడంలో అతిశయోక్తి లేదేమో?  H-1B రుసుము ప్రకటన చేస్తున్నప్పుడు హావర్డ్ లట్నిక్ అన్నమరొక వ్యాఖ్యను కూడా గమనించండి. “ఉచితంగా ఇచ్చే ఈ వీసాలపై ప్రజలు ఈ దేశంలోకి రావడం అనే పనికిరాని విషయాలు ఆపండి.” అన్నారు లట్నిక్. 

ఇదంతా గమనిస్తున్న నాకు స్వేఛ్ఛాదేవి విగ్రహం (స్టాట్యూ అఫ్ లిబర్టీ) పాదాల వద్ద చెక్కబడ్డ ఎమ్మా లాజరస్ కవిత లో ఓ భాగం గుర్తొచ్చింది. ఆ భాగానికి ఇది నా స్వేచ్ఛానువాదం.  

“మీ పురాతన భూములను, మీ గొప్ప ఆడంబరాన్ని మీరే ఉంచుకోండి!” 

నిశ్శబ్ద పెదవులతో ఆమె (స్వేఛ్ఛాదేవి) వేసిన కేక 

“నాకివ్వండి మీ అలసినవారిని, మీ పేదవారిని, 

స్వేచ్ఛగా శ్వాస తీసుకోవాలని ఆరాటపడే మీ ప్రజల సమూహాన్ని 

మీ సంపన్న తీరాలలోని దుర్భరమైన నిరాశ్రయులను. 

పంపించండి వీరిని, ఇల్లు లేనివారిని, తుఫానుకు చిక్కుకున్నవారిని నా దగ్గరికి, 

నేను నా దీపాన్ని ఆ బంగారు ద్వారం పక్కన ఎత్తుతాను.”

“Keep, ancient lands, your storied pomp!”

cries she with silent lips. 

“Give me your tired, your poor,

Your huddled masses yearning to breathe free,

The wretched refuse of your teeming shore.

Send these, the homeless, tempest-tost to me,

I lift my lamp beside the golden door!”

ప్రెసిడెంట్ ట్రంప్ కు నా అభ్యర్ధన: “ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా ఒక తల్లి అయితే, స్వేచ్ఛాదేవి ఆమెకు ప్రతిరూపం. ఆ తల్లి పాదాల కింద చెక్కబడిన ఆమె కేక వినండి. దయచేసి ఆ తల్లిని అమ్మకానికి పెట్టొద్దు.”

– V. మోహన మురళీధర్, 

mohanamuralidhar@gmail.com 

ఈనాడు వారు సెప్టెంబర్ 23న ప్రచురించిన వెర్షన్ ఈ క్రింద ఉంది: