జులై 26న ఈనాడులో ప్రచురితమైన నా సంపాదకీయ వ్యాసం పూర్తి భాగం ఇది.
అమెరికా ఒక కథా పుస్తకం అయితే – దాని రచయితలు వలసదారులు – ఇమిగ్రెంట్లు. మా దేశంలో నేనొక ఇమిగ్రెంట్ ను. అందరిలాగా నేను కూడా ఈ “స్వేచ్ఛా భూమి” లో అవకాశాల కోసం ఇక్కడికి ప్రయాణించా. ఈ దేశం “ధైర్యవంతుల నిలయం (ల్యాండ్ అఫ్ ది బ్రేవ్)” – అలా అన్నది మా జాతీయ గీతంలో కొసమెరుపు. ఇమ్మిగ్రేషన్ అనేది గడిచిపోయిన చరిత్ర కాదు; అది మా వర్తమానానికి, భవిష్యత్తుకు చోదక శక్తి. గణాంకాల్లో తేడా లేదు – అమెరికా దేశం లోని ఫార్చ్యూన్ 500 కంపెనీలలో దాదాపు 45 శాతం ఇమిగ్రెంట్లు, లేక వారి పిల్లలచే స్థాపించబడ్డాయి. వాళ్ళు తరతరాలుగా ఇక్కడ ఉంటున్న అమెరికన్ల కంటే చాలా ఎక్కువ శాతంలో వ్యాపారాలను ప్రారంభిస్తారు, సఫలీకృతులౌతారు, ఉద్యోగాలు సృష్టిస్తారు. సంపద సృష్టి కి, సృజనకు ప్రోత్సాహం, సామాజికాభివృద్ధి వంటి ప్రతి ముఖ్యమైన కొలమానంలో – ఇమిగ్రెంట్లు అమెరికా కు అపారంగా మేలు చేస్తున్నారు. ఇమిగ్రెంట్లకు ఇంతగా రుణపడి ఉన్న దేశం అయినా, ఇప్పటి ఈ ప్రభుత్వం ఆ ఇమిగ్రెంట్ల మీద, తద్వారా దేశ భవిష్యత్తు, శ్రేయస్సు పై కూడా యుద్ధం చేస్తున్నట్లే.
ప్రస్తుత పరిపాలనా యంత్రాంగం (Trump administration) అక్రమ వలసలను అరికట్టాలనే నెపంతో, చట్టబద్ధమైన మార్గాలకు పద్ధతి ప్రకారం అడ్డంకులను నిర్మించింది. ఇది కేవలం సరిహద్దు భద్రతకు సంబంధించింది కాదు; ఇది గొప్ప సంస్థలైన విశ్వవిద్యాలయాల ప్రాంగణాల వరకు విస్తరించిన ఒక ప్రతికూల దుష్ప్రచారం, కుతంత్రం.
ఇది రెండు వైపుల యుద్ధం. ఒకవైపు ట్రంప్ యంత్రాంగం, వీసాలు ఒక ఆయుధంగా మార్చింది. భవిష్యత్ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు కాబోయే విద్యార్థులు, అమెరికా కు అవసరం. వాళ్ళు తమ సోషల్ మీడియాలో – ఉద్దేశ పూరితంగా కానీ, అమాయకంగా కానీ – చేసిన ప్రతి చిన్న అసమ్మతి వ్యాఖ్య మీద అనవసరమైన, అర్థరహితమైన, దురుద్దేశ పూరితమైన తనిఖీలను ఎదుర్కొంటున్నారు.
ప్రతిష్ఠకు తూట్లు
అకస్మాత్తుగా వేలకు వేల వీసాల రద్దు చేయడం, కొత్త విద్యార్థి వీసాల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం – ఇవి ఈ ప్రభుత్వ యంత్రాంగం అనాలోచితంగా, అర్ధాంతరంగా, అనాగరికంగా, తీసుకున్న నిర్ణయాలు. అంతే కాదు ముఖ్యమైన దేశాల నుండి విద్యార్థుల దరఖాస్తుల లో భారీ క్షీణత కనబడుతోంది. అది ఉద్యోగరీత్యా నేను ప్రతి రోజూ చూస్తున్నాను. మార్చి 2025తో ముగిసిన ఆరు నెలల కాలానికి, F-1 విద్యార్థి వీసాలు 15% తగ్గాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదంతా స్టూడెంట్ వీసాల గురించి ట్రంప్ యంత్రాంగం తీసుకున్న తలా తోక లేని నిర్దాక్షిణ్యమైన నిర్ణయాలకు ముందొచ్చిన వార్త. నా ఉద్దేశంలో రాబోయే విద్యా సంవత్సరానికి వాస్తవ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండవచ్చు. 80 శాతం కు పైగా విదీశీ విద్యార్థుల రాక తగ్గితే, కొంచెంకూడా ఆశ్చర్య పోను
రెండవ వైపు, ట్రంప్ యంత్రాంగం ఉన్నత విద్యపైనే ఒక సైద్ధాంతిక దాడిని (ideological war) ప్రారంభించింది. “వోక్‌నెస్” (wokeness), యూదు (Jewish) వ్యతిరేకతపై ఆందోళనలను ఉటంకిస్తూ, హార్వర్డ్ నుండి యూనివర్సిటీ అఫ్ వర్జీనియా వరకు రిసెర్చ్ నిధుల రద్దు చేయడం, మినహాయించడం, నిలిపేస్తామన్నబెదిరించడం; భారమైన దర్యాప్తులు నిర్వహించడం. ఇది నిత్యం జరుగుతోంది. డైవర్సిటీ, ఎక్విటీ అండ్ ఇంక్లూషన్ (DEI) కార్యక్రమాలపై సవాళ్ళు లక్ష్యంగా చేసుకుంది. ఎలాంటివి ఆ సవాళ్ళు – శ్వేత జాతీయులను ఈ యూనివర్సిటీలు discriminate చేస్తున్నాయట. DEI ను ఒక బూతు పదంగా మలచడంలో ట్రంప్ర్ యంత్రాంగం నెగ్గింది. 52 బిలియ డాలర్ల ఎండోమెంట్ ఉన్న హార్వర్డ్ వంటి దిగ్గజం పోరాడగలదు, కానీ చాలా యూనివర్సిటీలు అదే స్థాయిలో ఫెడరల్ ప్రభుత్వం తో పోరాడలేవు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలు తమ దగ్గర ఉన్న వనరులను న్యాయపోరాటానికి మళ్లించాలి వస్తుంది, అంతెందుకు, మా యూనివర్సిటీ ప్రాంగణాలలో నే ఒక భయానక వాతావరణం నాకు కనిపిస్తోంది. ఇది ట్రంప్ యంత్రాంగం కోరుకొనే అంతిమ విజయం – విద్యా స్వేచ్ఛ అణచివేత.
ఈ ద్వంద్వ నీతికి దిగ్భ్రాంతి పడక తప్పదు. ఎందుకంటే, ఇక్కడ అన్ని విధాలా నష్టపోతున్నది అమెరికా – ఇతర దేశాలు కాదు. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా కు భారం కాదు; వాళ్ళు అమెరికా విలువైన ఆస్తులలోఒక భాగం. 2023-2024 విద్యా సంవత్సరంలో, అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్లు అందించారు – ముఖ్యం గా ట్యూషన్ రూపేణా. ఆ పైన, 378,000 కంటే ఎక్కువ అమెరికన్ ఉద్యోగాలకు మద్దతు ఇచ్చారు. ప్రతి ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థులకు, అమెరికా లో ఒక ఉద్యోగం సృష్టించబడుతుంది. అమెరికాకు భారీ వాణిజ్య మిగులు (trade surplus) ఉన్న అతి కొద్ది రంగాల్లో ఉన్నత విద్య ఒకటి—దాదాపు $40 బిలియన్లకు పైగా—ఇది goods వాణిజ్యంలో అమెరికా ఎదుర్కొంటున్న భారీ trade deficit పూడ్చడానికి చాలా కీలకం. విశ్వవిద్యాలయాలపై దాడి చేయడం, విదేశీ విద్యార్థులను నిరుత్సాహ పరచడం ద్వారా, అమెరికా అకడమిక్ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ఒక శక్తివంతమైన ఆర్థిక యంత్రాన్ని ఉద్దేశపూర్వకంగా మా చేతులారా మేమే నాశనం చేసుకుంటున్నాం.


అంతే కాదు – సులభంగా లెక్కించలేని నష్టం ఇంకా పెద్దది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్—వీళ్ళు ఆధునిక పరిశ్రమల దిగ్గజాలు, ట్రిలియన్ల డాలర్ల విలువను సృష్టించి మన ప్రపంచాన్ని మార్చిన దిగ్గజాలు వీళ్ళు. వీళ్ళు ముగ్గురూ మొదట అమెరికాకు విద్యార్థి వీసాలపైనే వచ్చారు. వెంచర్-క్యాపిటల్-మద్దతు ఉన్న వలస పారిశ్రామికవేత్తలలో 75% మంది అమెరికా లో ఉన్నత విద్యను పొందారని మనకు తెలుసు. ప్రతిభాశాలులు ఇక్కడ పుట్టకున్నా, అమెరికా ప్రపంచ ప్రతిభకు పుట్టినిల్లు. అమెరికా దేశం ప్రగతికి సోపానం. విద్యుత్తు, రేడియో, టీవీ, కారు, విమానం, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ – ఆఖరికి అణ్వాయుధం కూడా – ఇవన్నీ ఇక్కడే పుట్టాయి. పెరిగాయి. ప్రపంచ దేశాల్లో మెట్టాయి. వీటన్నింటి వెనక చాలా మంది ఇమిగ్రెంట్ మేధ ఉంది. ఇప్పుడు అమెరికా వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే: ఈనాటి ఇమిగ్రెంట్ ప్రతికూల వాతావరణాన్ని చూసి, ఎంతమంది భవిష్యత్ మస్క్‌లు లేదా పిచాయ్‌లు తమ ప్రతిభను వేరే దేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు?
శాశ్వత ప్రభావం
నేను ఇండియా లో పుట్టాను. పెరిగాను. చదువుకున్నాను. 1989లో F-1 వీసాపై ఈ దేశానికి వచ్చాను. ఇప్పుడు ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. ఈ నావాదన సిద్ధాంతపరమైనది కాదు; ఇది చాలా వ్యక్తిగతమైనది. ఆనాడు మద్రాస్ లోని అమెరికన్ కాన్సులేట్ లో నా వీసా ఇంటర్వ్యూ చాలా క్లుప్తంగా, గౌరవప్రదంగా జరిగింది. ఆనాడు నన్ను స్వాగతించిన అమెరికా ఆత్మవిశ్వాసంతో, నిష్కపటంగా ఉంది. నేను రెండు గొప్ప సంస్కృతుల నుండి ఉత్తమమైన వాటిని స్వీకరించి ఇక్కడ ఒక జీవితాన్ని నిర్మించుకున్నాను.
కానీ నేను ఈ రోజు కూడా అమెరికా రావాలన్ననిర్ణయం తీసుకుంటానా? నా వ్యక్తిగత అభిప్రాయాలను పరిశీలించే ప్రభుత్వాన్ని, నా విశ్వవిద్యాలయాన్ని ఒక సైద్ధాంతిక శత్రువుగా చూసే ప్రభుత్వాన్ని, మరియు ఆశావహులైన విద్యార్థులను, భుక్తికోసం వలస వస్తున్న కష్ట జీవులను స్వాగతించడానికి బదులు అనుమానంతో చూసే ప్రభుత్వాన్ని ఎదుర్కొని, నేను ఈ రోజుకూడా అదే నిర్ణయం తీసుకుంటానా అని నన్ను నేనే అడిగాను! నిజాయితీగా చెప్పాలంటే, తీసుకోను. ఎందుకంటే, రాజకీయ వాతావరణం మారింది. ఈ సంపాదకీయంలో నేను ఇలా విమర్శించడం నా ప్రాధమిక హక్కు. అందరికీ ఉంది ఆ హక్కు – అమెరికా పౌరులైనా, కాకున్నా, అలాంటి హక్కును వినియోగించి కాలేజీ దిన పత్రికకు వ్యాసం వ్రాసింది ఒక PhD విద్యార్థిని జైల్లో పెట్టింది ఈ ప్రభుత్వం. ప్రజలు భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ కోల్పోతే అమెరికా కు నార్త్ కొరియా కు తేడా లేదు.
ఇక్కడే అసలు విషాదం ఉంది. తిరస్కరించబడిన ప్రతి విద్యార్థి వీసా – కెనడా, యుకె,లేక ఆస్ట్రేలియాలో చదువుకోవాలని నిర్ణయించుకున్న ప్రతి ప్రతిభావంతుడి వల్ల అమెరికాకు శాశ్వత నష్టం. ఈ నాటి అమెరికా ప్రభుతవం తన దీర్ఘకాలిక ప్రపంచ నాయకత్వాన్ని ఇన్నొవేషన్ లో, విజ్ఞానశాస్త్రంలో, వాణిజ్యంలో సంకుచితంగా, వివక్షాపూరితంగా రాజకీయ అజెండా తాత్కాలిక సంతృప్తి కోసం అమ్ముతోంది. మా అమెరికా కేవలం ప్రపంచంపైనే కాదు, తన సొంత భవిష్యత్తు పైనే తలుపులు వేసేస్తోంది.
– మోహన మురళి
జులై 26న ఈనాడులో ప్రచురితమైన వ్యాసం

జులై 26న ఈనాడులో
ప్రచురితమైన వ్యాసం