కిషన్ యాత్రతో బీజేపీకి మంచి రోజులు ?

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఎందుకు చప్పబడిపోయింది. ఏకారణాలవల్ల తెలంగాణ సాధన పోరు చల్లారిపోయింది ? ఈ ప్రశ్నే తరచూ వినబడుతోంది. సరిగా ఈ పరిణామాన్నే తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది భారతీయ జనతాపార్టీ. అందుకే బీజేపీ తెలంగాణ పోరుయాత్ర మొదలుపెట్టింది. తెలంగాణ సాధన భారతీయ జనాతాపార్టీకే సాధ్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు.
ఇంతకీ బీజేపీ పోరు యాత్ర ఎలా సాగుతుందో తెలుసుకుందాం… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి తలపెట్టిన యాత్ర ఇది. గురువారం మక్తల్ లో బహిరంగ సభలో లాంఛనంగా ప్రారంభైన ఈ యాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మీదగా మొత్తం ఇరవైరెండు రోజులపాటు మూడువేల ఆరువందల కిలోమీటర్ల మేరకు సాగుతోందని చెబ్తున్నారు. వచ్చే నెల తొమ్మిదిన ఈ యాత్ర ముగుస్తుంది. ఈలోగా ఎనభైఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు వందల మండలాల్లోని తొమ్మదివేల గ్రామాలను ఈ యాత్ర చుట్టుమడుతుంది. ఈ యాత్ర సవ్యంగా సాగితే, కచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాలేమిటో కేంద్ర సర్కారుకు తెలిసొస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణ రాక సంగతి ఎలా ఉన్నా, రాష్ట్రంలో బీజేపీ ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ యాత్ర దోహదపడుతుందనే అనుకోవాలి. పందొమ్మిదివందల తొంభైఎనిమిది ప్రాంతంలో తెలంగాణ లో గట్టిపట్టు ఉన్న బీజేపీ ఆ తర్వాత క్రమంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయ పరిపుష్టతకు ఈ యాత్ర దోహదబడుతుందనే చెప్పాలి.