రాజకీయాలను నిశితంగా గమనించే వారికి ‘జెర్రీమాండరింగ్’ (Gerrymandering) అనే పదం కొత్తేమీ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పార్టీ లేదా గ్రూప్‌కి అన్యాయంగా ఎక్కువ లాభం కలిగేలా, ఎన్నికల జిల్లాల (electoral district) సరిహద్దులను మార్చడాన్నే జెర్రీమాండరింగ్ అంటారు. దీనివల్ల కొన్ని జిల్లాల ఆకారాలు చాలా వింతగా, సరిగా లేకుండా తయారవుతాయి.
ఈ పద్ధతిని ప్రధానంగా రెండు రకాలుగా ఉపయోగిస్తారు:
- పగలగొట్టడం (Cracking): ప్రత్యర్థి పార్టీ ఓట్లను అనేక జిల్లాల్లోకి విడదీయడం. దీనివల్ల వాళ్లకు ఏ జిల్లాలోనూ మెజారిటీ రాదు.
- కుక్కడం (Packing): ప్రత్యర్థి పార్టీ ఓట్లను కొన్ని జిల్లాల్లోనే కుక్కేయడం. వాళ్లు ఆ సీట్లలో గెలిచినా, చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ల బలం తగ్గిపోతుంది.
దీని అతిపెద్ద దుష్ఫలితం ఏంటంటే – రాజకీయ నాయకులే తమ ఓటర్లను ఎంచుకుంటారు, ఓటర్లు తమ నాయకులను కాదు. అందుకే దీన్ని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యగా చూస్తారు.—–CA ప్రాప్ 50 కథ: దేశ రక్షణ కోసం ‘ఎలక్షన్ రిగ్గింగ్ ప్రతిస్పందన చట్టం’
కాలిఫోర్నియాలో నవంబర్ 4, 2025న జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో ప్రాప్ 50 సంచలనం సృష్టించింది. దీనికి అధికారిక పేరు “లెజిస్లేటివ్ కాంగ్రెస్ రీడిస్ట్రిక్టింగ్ మ్యాప్ అమెండ్‌మెంట్ వాడకం.” కానీ, దీన్ని ముద్దుగా “ఎలక్షన్ రిగ్గింగ్ ప్రతిస్పందన చట్టం” అని పిలవడం వెనుక బలమైన కారణం ఉంది.
నేపథ్యం ఏమిటంటే?
చాలా ఏళ్ల క్రితం, కాలిఫోర్నియా ఓటర్లు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉండేందుకు ఒక స్వతంత్ర పౌరుల రీడిస్ట్రిక్టింగ్ కమిషన్ (CRC) ఏర్పాటుకు ఓటు వేశారు. ఈ కమిషనే కాంగ్రెస్ జిల్లాల మ్యాప్‌లను గీయాలి, తద్వారా ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా మారుతుంది.
అయితే, 2025లో టెక్సాస్ లాంటి ఇతర రాష్ట్రాలు తమ పార్టీలకు అనుకూలంగా (జెర్రీమాండరింగ్ చేస్తూ) కొత్త కాంగ్రెస్ మ్యాప్‌లను ప్రకటించాయి. ఈ చర్య దేశవ్యాప్తంగా రిపబ్లికన్‌లకు కాంగ్రెస్‌లో దశాబ్దమంతా మెజారిటీ ఉండేలా చేస్తుందని డెమోక్రాట్లు ఆందోళన చెందారు.
దీన్ని కాలిఫోర్నియా డెమోక్రాటిక్ నాయకులు (ముఖ్యంగా గవర్నర్ గావిన్ న్యూసోమ్) దేశ ప్రజాస్వామ్యానికే, మరియు కాలిఫోర్నియా రాజకీయ పలుకుబడికి ప్రమాదంగా చూశారు.
‘కత్తికి కత్తి’ పోరాటం
“ఇతర రాష్ట్రాలు ఎన్నికలను ‘రిగ్’ చేస్తుంటే, కాలిఫోర్నియా కూడా తమ ప్రభావాన్ని కాపాడుకోవడానికి ‘కత్తికి కత్తి’ లాగా పోరాడాలి,” అని న్యూసోమ్ అండ్ కో వాదించారు. అందుకే డెమోక్రాట్ల ఆధీనంలో ఉన్న రాష్ట్ర శాసనసభ, ప్రాప్ 50ని ప్రత్యేక ఎన్నికల బ్యాలెట్‌లో పెట్టింది.
ఓటర్లను ఏం అడిగారంటే: CRC అధికారాన్ని తాత్కాలికంగా ఆపేసి, బదులుగా శాసనసభ గీసిన కొత్త కాంగ్రెస్ మ్యాప్‌ను వాడుకోవాలి. ఈ మ్యాప్ సుమారు ఐదు రిపబ్లికన్ సీట్లను డెమోక్రాట్ల వైపు తిప్పుకునేలా తయారుచేశారు.నవంబర్ 4న ప్రాప్ 50 ఎలా నెగ్గింది?
ఈ ఎన్నికల ప్రచారం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన బ్యాలెట్ యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. “ఎస్ ఆన్ ప్రాప్ 50″కి మద్దతిచ్చిన గవర్నర్, డెమోక్రాటిక్ పార్టీ, మాజీ అధ్యక్షుడు ఒబామా లాంటి వాళ్లు భారీగా నిధులు ఖర్చు చేశారు. ఇతర రాష్ట్రాల జెర్రీమాండరింగ్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా నిలబడాలనే సందేశం డెమోక్రాటిక్ ఓటర్లను ఏకం చేసింది.
“నో ఆన్ ప్రాప్ 50” వైపు ఉన్న రిపబ్లికన్లు, స్వతంత్ర పాలనను కోరుకునే వాళ్లు… ఈ ప్రాప్ 50 కేవలం అధికార దాహం అని, ఇది స్వతంత్ర కమిషన్ స్ఫూర్తిని చంపుతుందని వాదించినా, దేశ రక్షణ కోసం ఈ చర్య తప్పదనే వాదన బలంగా నిలిచింది.
ఫలితం: ప్రాప్ 50 చాలా సులువుగా నెగ్గింది. నవంబర్ 4, 2025 నాటి ప్రత్యేక ఎన్నికల్లో, సుమారు 63.9% ఓటర్లు దీనికి ఆమోదం తెలిపారు.
ఈ ఆమోదం వల్ల డెమోక్రాట్లకు అనుకూలంగా గీసిన కొత్త మ్యాప్ వెంటనే అమల్లోకి వచ్చింది. ఇది 2026, 2028, మరియు 2030 హౌస్ ఎన్నికలకు వాడుతారు. CRC మళ్లీ 2030 జనాభా లెక్కల (Census) తర్వాతే మ్యాప్‌లు గీయగలదు. అయితే, కొత్త మ్యాప్‌లో జాతిని (race) వాడుకున్నారని రిపబ్లికన్లు ఇప్పటికే కోర్టులో సవాలు చేశారు. ఈ కథ ఇక్కడితో ఆగేలా లేదు!