ఎన్నారైలు మ‌న‌వాళ్ళేనా..?!

– వీరు అతిథులా..? ఆత్మీయులా..?

– భార‌త్‌కి కావ‌ల‌సింది వారి ఐశ్వర్యమా..?  లేక అనుభ‌వ సంప‌దా..?

– ఎన్నారై డ‌బ్బు మూట‌ల‌పై పాల‌కుల దృష్టి..

– క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేని దుస్థితి..

 

అస‌లు ఎన్నారైలు మ‌న‌వాళ్ళేనా అని ఎవ‌రైనా ప్రశ్నిస్తే వాళ్ళని మ‌నం పిచ్చివాళ్ళని చూసిన‌ట్టు చూస్తాం.ప్రవాస భార‌తీయుల్ని ఎన్నారైలుగా పిలుచుకుంటున్నాం.. అలాంట‌ప్పుడు ఎన్నారైలు మ‌న‌వాళ్ళు కాక ప‌రాయివాళ్ళు ఎలా అవుతారు..? మ‌న‌తో పేగుబంధం, ఆత్మీయ అనుబంధం, మాతృభూమి మీద ప్రేమ, ఉప్పొంగుతున్న ఎన్నారైలు ఖ‌చ్చితంగా మ‌న‌వాళ్ళే..! కాక‌పోతే గ‌త కొంత‌కాలంగా దూర‌మ‌యిపోతున్నార‌న్న భావ‌న క‌లుగుతోంది. ఈ అంత‌రాల‌ను త‌గ్గించ‌డం కోసం ఏటా ప్రవాసీ భార‌తీయ దివస్ ని జ‌రుపుకుంటున్నాం. ఇలా ఎప్పుడూ ప్రవాస భారతీయ‌ల దీవాస్ జ‌రుపుకున్నా పాల‌కుల దృష్టి ఎంత‌సేపటికీ పెట్టుబ‌డుల రూపంలో వారు ప‌ట్టుకొచ్చే మూట‌ల మీదే ఉంటుంది. మాతృదేశ ప్రగ‌తికి చేయూత అందించాల‌ని మంత్రులు ప‌దే ప‌దే విజ్ఞప్తులు చేస్తున్నా ఆశించిన రీతిలో ఎన్నారైలు పెట్టుబ‌డులు పెట్టటం లేదు. దీంతో అక్కడ‌క్కడా స్థిర‌ప‌డిపోయిన ఎన్నారైల మ‌న‌వాళ్ళేనా అన్న సందేహం రాక మాన‌దు.

అయితే ఇక్కడో విశ‌యం స్పష్టంగా గ్రహించాలి. ప్రవాస భార‌తీయులు పెట్టుబ‌డులు విసృతంగా పెట్టాలంటే వారికి ప్రభుత్వం త‌ర‌పునుంచి భ‌రోసా ఉండ‌లి. ఒక్కొక్క రాష్ట్రం స‌మ‌స్యల అగ్నిగుండంలో మాడిపోతుంటే ఏ మొహం ప‌ట్టుకుని ఎన్నారైలు డాల‌ర్టు కుమ్మరిస్తారు..? ఏం చూసుకుని వ్యాపార నిమిత్తం కాసులు ధార‌పోస్తారు. ఒక్క మ‌న రాష్ట్రాన్నే తీసుకుందాం. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప‌రిశ్రమ‌ల పెట్టుబ‌డులు పెట్టే వారే క‌రువ‌యిపోయారు. దీనిక తోడు ఆర్థిక ప‌ర‌మైన కుంభ‌కోణాల పుట్ట క‌ద‌ల‌డంతో అనేక కంపెనీలు మూత ప‌డ‌ట‌మో, లేదా ఆ స్థాయికి రావ‌డ‌మో జ‌రిగిపోయాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టడ‌మంటే తెలిసి తెలిసి అడుసు తొక్కిన‌ట్లే. మిగ‌తా రాష్ట్రాల్లో ప‌రిస్థితి కూడా ఆశా జ‌న‌కంగా లేదు.

ఒక్కసారి ప్రవాస భార‌తీయుల గురించి 2003లో నాటి ప్రధాన మంత్రి వాజ్‌పేయి అన్న మాట‌లు గుర్తు చేసుకుందాం..

స‌దా మా గుండెల్లో కొలువై ఉండే మిమ్మల్ని, అతిథుల‌ని ఎలా అన‌గ‌లం..? అంటూ వాజ్‌పేయ్ ప్రవాస భార‌తీయుల స‌ద‌సుల్లో ఆత్మీయ సంభాష‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇవి వాజ్‌పేయి మాట‌లు అక్షర స‌త్యం కావాలి. ఎన్నారైలు మూటలు తీసుకువ‌చ్చే ముదుపరులుగా భావించ‌కుండా వారిని అత్యంత ఆత్మీయులుగానే చూడాలి. ఈ సంద‌ర్భంగా 1946లో పండిట్ నెహ్రూ ప్రవాస భార‌తీయులనుద్దేశించి అన్న మాట‌లు కూడా గుర్తు చేసుకోవాలి. విదేశీ గ‌డ్డపై ఉన్న త‌న బిడ్డల‌ను ఇండియా మ‌రిచిపోలేదు, ఈరోజు వాళ్ళని ఆదుకోలేక‌పోవ‌చ్చు గాక‌, వారిని కాపాడేందుకు భార‌త్ ముందుకు ఉరికే స‌మ‌యం త్వర‌లోనే వ‌స్తుంది.

నెహ్రూ ఈ మాట‌ల‌న్నది స్వాతంత్ర్యం రాక‌ముందు.. అయితే స్వాత్రంత్ర్య వ‌చ్చి ఆరు ప‌దులు దాటిన త‌ర్వాత కూడా నేటికీ సొంత గ‌డ్డమీద ప్రవాస భార‌తీయులు ప‌రాయివాళ్ళుగానే ఉండిపోతున్నారు. త‌ప్పు వారిలో లేదు… త‌ప్పు మ‌న‌లోనే ఉంది..! మ‌నం వారిని ఏ దృష్టితో చూస్తున్నాము అన్నదే ప్రధ‌న‌మైన‌ది. ఎన్నారై అన‌గానే సంచీల‌తో కాసులు కుమ్మరిస్తార‌ని భావించ‌టం త‌ప్పు. వారు మాతృ దేశ ప్రగ‌తికి స్వచ్ఛందంగా ముందుకు వ‌చ్చే స‌క‌ల సౌక‌ర్యాల‌ను అందిచిన‌ప్పుడు ఖ‌చ్చితంగా ఎన్నారైలు అతిథులుగా కాకుండా, ఆత్మీయులుగా ఈ నేల‌కు దిగివ‌స్తారు.

ఎన్నార‌కైల‌కూ, మ‌న‌కూ మ‌ధ్య ఉన్నది సాంస్కృతిక బంధం, మాన‌వీయ సంబంధ‌మే కానీ మ‌నీ బాండ్ కాదు..

-తుర్లపాటి నాగ‌భూష‌ణ రావు

3 Comments on "ఎన్నారైలు మ‌న‌వాళ్ళేనా..?!"

  1. Hello Rao Garu,
    Did you publish this same article on some other site too? I found this on 5amnews site also.
    In such cases, is it required to mention? I am just wondering how these journalistic practices work.
    Would appreciate your response.

  2. Mahesh Saladi | January 11, 2012 at 10:43 PM |

    నాగభూషణరావు గారు వ్యక్తం చేసిన మంచి భావాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాని, మా ఎన్నారైలు కూడా, భారతదేశంతో మన అనుబంధంద్వారా ప్రతిఫలం ఆశించడమేకాకుండా, దేశానికి మనవల్ల ప్రయోజనాలు చేకూరేట్టూ వుండాలని, దేశాన్ని విమర్శించడంకన్నా దేశం మెరుగుపడటానికి, ముందంజ వేయడానికి కనీస బాధ్యత తీసుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం.

    ప్రస్తుత భారతదేశానికి, ఎన్నారై డబ్బుకన్నా (నిజంగా చెప్పాలంటె డాలరుకి 50 రూపాయల లెక్క తప్ప ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంవల్ల ధనికులైన అనేకమందితో పోల్చుకుంటే మనమెంత, రూపాయలలోకి మార్చాకకూడా మన సేవింగ్స్ విలువెంత!), “భారతీయత”కు గౌరవం, పేదతనం, అనారోగ్యాలు రూపుమాపడం వంటి మంచిపనులకి భారతీయప్రజానీకానికి మన సహకారం అవసరం.

    ఒకవేళ మీరు మనమాతృ దేశానికి కొంచెం దూరంగా వుంటున్నట్లు మీకనిపిస్తే,

    ఈపాటికే మిత్రులెందరో పాటిస్తున్నట్టుగా,
    మంచి మనసుతో ఆలోచించండి,
    మనకి విద్యాబుద్ధులు నేర్పిన మన ఇల్లు, బడి, గుడి, వూరు, మాస్టారు, స్నేహితులను గుర్తు తెచ్చుకోండి,
    మేమున్నామని (నిఝంగా జీవితంలొ వారికి అవసరం వుందని, మీ మనసుకు అనిపిస్తే (కనిపిస్తే) కొంచెం చెయూతనివ్వండి.

    “పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపర నీ జాతి నిండు గౌరవము”

    శుభాభినందనలతో
    మహేష్ సలాది, న్యుయార్క్

    • మహేష్ గారు.. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి వీలు కల్పించడం లాంటి అడుగులు భారత ప్రభుత్వం వేస్తే ఎన్నారై లు మాతృభూమి కి మరింత దగ్గరవుతారు, మరింతగా మమేకమవుతారు.

Comments are closed.