కష్టకాలంలో ఆదుకున్నవారిని గుర్తించుకోవడం, ప్రతిగా వారి ప్రయోజనాలను చూడటం ఆనవాయితీ. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం, శాసనసభలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాసతీర్మానం పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సొంతగూటిలోనే వ్యతిరేకత. జగన్ వర్గీయులు ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం లేదని బల్లగుద్ది చెప్పేశారు. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం గట్టెక్కడంలో ప్రజారాజ్యం పార్టీ అండగా నిల్చింది. ఈ సందర్బంగానే కాంగ్రెస్ పెద్దలు, చిరంజీవికి కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని తీర్చడాన్ని సుదీర్ఘ రాజకీయ బంధంగా సోనియా భావించిఉంటారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో పీఆర్పీకి సముచితస్థానం ఇచ్చారు. దీంతో పీఆర్పీకి లైన్ క్లియర్ అయింది. గంటా శ్రీనివాసరావు, సి. రాంచంద్రయ్యలు గురువారం ఉదయం పదకొండు గంటల నలభైఐదు నిమిషాలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అలాగే, కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయంకూడా తీసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డికి చీటికీమాటికీ అడ్డుతగులుతూ, మాటలతూటాలు పేలుస్తున్న శంకర్ రావును మంత్రివర్గం నుంచి తప్పించారు. మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణలో తన మాటదక్కించుకోలేకపోయినా, శంకర్ రావును సైడ్ చేయడంలో మాత్రం సీఎం తన పంతం దక్కించుకున్నారనే చెప్పాలి.
ఇక తెలంగాణ కోసం రాజీనామాచేసిన మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఉన్నందున త్వరలో దానిపై దృష్టి పెట్టనున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు పదవి రావడంతో డి. శ్రీనివాస్, పాలడుగు వెంకట్రావు, రుద్రరాజు పద్మరాజు, మహ్మద్ జానీ లాంటి నేతలు పూర్తి స్థాయి మంత్రివర్గ ప్రక్షాళన జరగాలని అంటున్నారు.
ఎమ్మెల్యేలు గండ్ర వెంకట్రమణా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ్రు మురళిమోహన్ లు తమకు ఛాన్స్ ఉంటుందని భావించినా వారికీ ప్రస్తుతానికి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో అసమ్మతిసెగల్ని సీఎం ఎలా కట్టడి చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.