జ్ఞాపకం (Published in Telugu Velugu Feb 2013 issue) by Varun Parupalli

సాయంత్రం ఆరున్నర కావొస్తుంది… సికిందరాబాదు నుండి గుంటూరు వెళ్ళే ‘గోల్కొండ’ రైలు అప్పుడే మధిర స్టేషన్ దాటుతుంది.
శ్రావణమాసం కాబట్టేమో, ముసురు పట్టినట్టుగా పొద్దుటినుంచి వాన పడుతూనే ఉంది. ప్లాటుఫారం పక్కనే గుడిసెలో ఉంటూ గుడుంబా అమ్ముకునే సావిత్రి, ఎవరితోనో గొడవపడుతూంది.
“ఎదవ సచ్చినోడా, డబ్బులు లేవని ఇంకా ఎన్ని రోజులు చెప్తావురా? ఇప్పటికి నాలుగొందలైంది నీ బాకీ. డబ్బులు కట్టి నువ్వు ఈడనుంచి కదులు…” అని అతని కాలర్ పట్టుకుంది.
అతనేమో “ఓసినీ… తప్పుడు లెక్కలు చెప్తున్నవేందే? మూదొందలాభై అయింది. రేపు జీతంపడగానే నీ డబ్బులు నీమొహాన కొడతా. గల్లా ఒదులు. నాగ్గానీ తిక్కరేగిందంటే నువ్వు ఈ ఏరియాలోనే లేకుండా చేస్తా..” అని ఊగిపోతున్నాడు.
“ఇప్పుడు తాగిన గుడుంబా మీ అయ్య సోమ్మనుకున్నవారా?” అంటూ అతడి జేబులు వెతుకుతుంది సావిత్రి. .
వాళ్ళిద్దరి గొడవ, రైలుదిగి, వర్షం వల్ల ఇళ్ళకి వెళ్ళలేక ప్లాటుఫారం మీదున్న షెడ్ల కింద చేరిన స్టూడెంటు కుర్రవాళ్ళకి మాంచి వినోదంగా ఉంది. వాళ్ళంతా మధిర, ఇంకా పొరుగూర్ల నుండి ఖమ్మం వెళ్లి చదువుకునే పిల్లలు. రైల్లో ఉన్నప్పుడు కోతుల్ని మించే అల్లరి చేసే ఆ రాలుగాయిలు, రైలు దిగాక మాత్రం చాలా బుద్ధిమంతులుగా మారిపోతారు. రైలు దిగాక కూడా అదే కోతి వేషాలు వెయ్యడం తెలిసినవాళ్లు ఎవరైనా చూస్తే, చూసింది ఇంట్లో చెప్పేస్తే  ఆరోజు అమ్మానాన్నల చేతిలో వీళ్ళకు బడితెపూజే!
ఆ పిల్లల మధ్య ఒక మనిషి మాత్రం సావిత్రి గొడవతో సంబంధం లేనట్టు తదేకంగా ప్లాటుఫారం చివరన వర్షంలో తడుస్తున్న ఖాళీ సిమెంటు బెంచి వంక చూస్తూ ఉన్నాడు.
అతను, షావుకారు భూషణంగారబ్బాయి మోహన్. ఇప్పుడే గోల్కొండ దిగాడు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత మధిర వచ్చాడు మోహన్. వాళ్ళ నాన్నగారు చనిపోయి అప్పుడే పదేళ్ళు అవుతుంది.
భూషణంగారు బతికున్న రోజుల్లో అయన తన స్నేహితులతో వాకింగుకి వచ్చి అక్కడే ఆ బెంచీ మీదనే సేదతీరేవారు. అయన స్నేహితులంటే రిటైర్డ్ లెక్చరర్ కృష్ణమోహన్, డాక్టర్ సీతారాం.
వాళ్ళు ముగ్గురూ బాల్యమిత్రులు. ఎస్సెల్సీ వరకు ముగ్గురూ కలిసి మధిర గవర్నమెంటు బళ్లోనే చదువుకున్నారు.
ఆ తర్వాత పై చదువులకోసం కృష్ణమోహన్, సీతారాం  చెరో దిక్కున పోగా, పై చదువులు చదివించే స్తోమత లేక భూషణంగారి తండ్రి ఆయన్ను వ్యాపారంలో పెట్టారు. భూషణం గారి వ్యాపార దక్షత వల్ల కొన్ని సంవత్సరాల్లోనే వారి వ్యాపారం బాగా వృద్ది చెందింది. కాని, అయన మాత్రం ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన విలువైన కాలాన్ని కోల్పోయారు.
చదువులు పూర్తయ్యాక కృష్ణమోహన్ మధిర కాలేజీ లో లెక్చరరుగా ఉద్యోగం సంపాదిస్తే, సీతారాం ఇక్కడే ప్రాక్టీసు పెట్టారు.
వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు. ఎన్ని పనులున్నా రోజూ ఉదయం రైల్వేస్టేషన్ దగ్గర వాకింగ్ కి వెళ్ళడం మాత్రం తప్పేవారు కాదు..ముగ్గురూ కలిసి ప్లాటుఫారం ఈ చివరునుండి ఆ చివరదాకా రెండు రౌండ్లు కొట్టి ప్లాటుఫారం చివరన ఉన్న సిమెంటు బెంచీ మీద కూర్చునేవాళ్ళు.
రాకెట్లనుండి రాగిపిండి దాకా అన్ని విషయాలగురించి వాళ్ళమధ్య చర్చ నడిచేది.

అలా రోజులు గడిచిపోతున్న సమయంలో ఒక శివరాత్రి, భూషణంగారి కుటుంబంలో చీకటి మిగిల్చింది.
మధిరలో శివరాత్రి తిరునాళ్ళ అంటే చుట్టుపక్కల ఇరవై ఊళ్ళల్లో తెలియనివారు ఉండరు. ఐదు రోజులు కన్నులపండువగా జరిగే ఆ తిరునాళ్ళకి ఎక్కడెక్కడినుంచో జనం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వేసుకొని మరీ వస్తారు.
ఆరోజు ప్రతియేడు లాగానే అయన తెల్లవారుఝామునే వాళ్ళింటినుండి బయల్దేరి గొల్లబజారు మీదుగా శివాలయానికి వెళ్తున్నారు. రామాలయం మలుపు దాటాక తుమ్మచెట్లదగ్గర రోడ్డుమధ్య ఏదో పడుంటే బండరాయనుకొని తీసి పక్కన పడేయ్యబోయారు. కాని అది రాయి కాదు… లుంగలు చుట్టుకుని పడుకున్న త్రాచుపాము. చుక్కపొద్దున చీకట్లో అది రాయిలాగా కనిపించింది.
అదేంటో తెలుసుకుని షావుకారుగారు చెయ్యి వెనక్కి లాక్కునేలోపే అయన ఎడమచేతిమీద కాటేసింది ఆ విషపురుగు. పాపం… భూషణంగారు అక్కడికక్కడే చనిపోయారు.
అప్పటికి మోహన్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఒక్కదాన్నే మధిరలో ఉంచలేక, దుకాణం అమ్మేసి, ఇల్లు అద్దెకి ఇచ్చేసి అమ్మని తనతో హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. ఎవరితోనైనా “మాది మధిర” అని చెప్పుకోవడానికి ఉన్న చివరి ఆధారం ఆ ఇల్లు.
ఇప్పుడు పుట్టిన ఊరితో ఉన్న ఆ ఆఖరి బంధాన్ని కూడా తెంచుకోవడానికి వచ్చాడు మోహన్.
ఇల్లు అమ్మడం…. అసలు తను కల్లో కూడా ఊహించని మాట. దానికి కారణభూతమైన సంఘటన పదిహేను రోజులకింద చోటుచేసుకుంది.

– ఆరోజు ఆఫీసునుండి రజిత ఎందుకో చిటపటలాడుతూ వచ్చింది. వస్తూనే అపార్టుమెంట్ కారిడార్లో ఆడుకుంటున్న చిట్టిని రెక్కపుచ్చుకుని ఇంట్లోకి లాక్కొచ్చింది.
ఆటచెడిందని ఏడుస్తున్న చిట్టికి ఇంకో రెండు తగిలించింది. ఇవన్నీ చూస్తూ తను ఊర్కోగలిగాడు కానీ అమ్మ ఉండలేకపోయింది.
“ఎందుకమ్మా పసిదాన్ని అలా బాదుతున్నావు? ఊర్కో… ఏమైంది నీకివ్వాళ?” అనడిగింది అమ్మ.
“దెయ్యంపట్టింది” అని బదులిచ్చి విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది రజిత.
ఎప్పుడూ తనముందు పరుషంగా మాట్లాడని కోడలు ఒక్కసారిగా అలా అనడంతో మనసు చివుక్కుమంది అమ్మకి. చిన్నబోయిన మొహంతో చిట్టిని ఎత్తుకొని బాల్కనీలోకి నడిచింది.
వీటన్నిటికీ తను మౌనప్రేక్షకుడిగానే మిగిలిపోయాడు.
రజిత కోపానికి కారణం మరుసటిరోజు ఉదయం తెలిసింది. ఆరోజు అమ్మకెంతో ఇష్టమైన ఇడ్లీ, కొబ్బరిపచ్చడి చేసింది రజిత.
తొమ్మిదైనా అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు రాలేదు. చివరకి రజితే టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని అమ్మ గదిలోకి వెళ్ళింది.
“నన్ను క్షమించండి  అత్తయ్యా, రాత్రి మీతో అలా మాట్లాడాల్సింది కాదు. కానీ, అప్పుడు నా మనసేం బాగుండలేదు. ఇంటికోసం తీసుకున్న లోనుకి  ఈనెల నుండి వాయిదా ఎక్కువైంది.
మా ఇద్దరిలో ఒకళ్ళ జీతం దానికే పోతుంది. మిగిలిన ఖర్చులు కూడా కొండలాగా పెరిగిపోతున్నాయి. ఆ చికాకులతో కొంచెం డిస్టర్బ్ అయ్యానంతే. ఏమనుకోకండి. మీరు నాకు అత్త కాదు అమ్మ కన్నా ఎక్కువని మీకు తెలియంది కాదు. లేవండి, లేచి టిఫిన్ చేయండి” అంది రజిత.
రజిత మాటలతో తేలికపడిన అమ్మ, “పిచ్చి పిల్లా, ఇంత చిన్నవిషయానికి మీరు ఇబ్బంది పడాలా? మధిరలో ఉన్న మనిల్లు అమ్మేద్దాం. ఆ డబ్బుతో లోను కొంత తీర్చెయ్యండి. అప్పుడు కిస్తీ దానంతట అదే తగ్గుతుంది. ఎప్పటికైనా ఆ ఇంట్లో మళ్ళీ మనం ఉంటామని లేదు. దానిమీద వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే. అమ్మేస్తే మీకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది కదా!” అంది.
రజిత, “అయ్యో అదేంటి అత్తయ్యా, అది మీ కష్టార్జితం. దాన్ని అమ్మడమేంటి? భలేవారే… మా తిప్పలేవో మేం పడతాం. ఇంకెప్పుడూ అది అమ్ముతామని చెప్పకండి” అని మరోమాటకి ఆస్కారమివ్వకుండా వచ్చేసింది.
ఆరోజు రాత్రి మోహన్ కి నారాయణ అనే అతను మదిర నుంచి ఫోన్ చేసాడు. “అమ్మగారు చెప్పారండీ, ఇల్లు అమ్ముతున్నారట కదా? ఏమాత్రం  చెప్తున్నారు? మీరు రేటు చెప్తే మంచి బేరం తగిలేలా నేను చూస్తా” అన్నాడు.
అమ్మ ఇల్లు అమ్మడానికి నిర్ణయించుకుందని మోహన్ కి అర్థమైంది. ఒక్కసారి నిశ్చయించుకుంటే ఎవరిమాటా వినేరకం కాదు అమ్మ. చేసేది లేక పన్నెండులక్షలకు నారాయణ తీసుకొచ్చిన పార్టీతో మాట్లాడడానికి వచ్చాడు తను. కుదిరితే రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి కూడా  సిద్ధమయ్యే వచ్చాడు.
అసలు, ఆ ఇల్లు అమ్మడం తనకు సుతరామూ ఇష్టంలేదు. షావుకారు భూషణం గారి ఇల్లంటే ‘లక్ష్మీసరస్వతీ నిలయం’ అనేవాళ్ళు ఆరోజుల్లో.
దానికి కారణం లేకపోలేదు… తనలాగా ఆర్ధిక కారణాలవల్ల చదువు ఆపేసిన పది మంది పేదపిల్లల్ని భూషణం గారు తన సొంత ఖర్చుతో చదివించేవారు. వాళ్ళందరూ అయన ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. అప్పట్లో పూట గడవడమే కష్టంగా ఉన్నవాళ్లు, ఈరోజు అయన పుణ్యమాని చదువుకొని వాళ్ల కాళ్ళమీద వాళ్ళు నిలబడగలిగారు.
అలాంటి జ్ఞాపకాలెన్నో ఆ ఇంటితో పెనవేసుకుని ఉన్నాయి.
ఇప్పుడు ఆ ఇల్లు కొనేవాళ్ళు దానిని పడగొట్టి షాపింగు కాంప్లెక్సు కడతారట, నారాయణ చెప్పాడు! ఇల్లు కూల్చేస్తారన్న ఊహనే భరించలేకపోతున్నాడు తను..

వాన వెలిసింది…
అరగంట గొడవ తర్వాత తాగినవాడి వాచీ గుంజుకొని బాకీ జమేసుకుంది సావిత్రి. అతడు కటికబూతులు తిడుతూ వెళ్ళిపోయాడు.
నెమ్మదిగా నడుచుకుంటూ స్టేషన్ బయటికి నడిచాడు మోహన్. ఆగకుండా పడిన వానకి రోడ్లన్నీ బురదమయమై పోయాయి.
ఆ బురదలో ఇంటికెలా వెళ్ళాలా అని చూస్తున్న మోహన్ కి వాళ్ళ పక్కవీధిలోనే ఉండే రిక్షా సాంబయ్య కనిపించాడు.
మోహన్ని చూడగానే “బాగున్నారా అబ్బాయిగారు?” అంటూ వచ్చి చేతిలో ఉన్న సూటుకేసు అందుకున్నాడు.
“బాగున్నాను సాంబయ్య తాతా… నువ్వెట్లా ఉన్నావు?” అడిగాడు మోహన్.
“నాదేముంది బాబూ, ఏదో ఈ జీవుడున్నంతకాలం రిక్షా సవారీ వెయ్యక తప్పదు. కొడుకులిద్దరూ చెరోదారి  చూసుకుని పొయ్యారు. ఒంటరిగాడిని, ఓపికున్నప్పుడు సవారీ వేస్తా, లేదంటే ముసుగుకప్పి పండుకోవడమే… అమ్మగారెలా ఉన్నారు బాబూ?” అన్నాడు సాంబయ్య.
దానికి మోహన్ “బాగానే ఉంది తాతా, ఇక్కడున్న ఇల్లు అమ్మేద్దామని చూస్తున్నాం. ఏదో బేరం వచ్చిందని చెప్తే మాట్లాడడానికి వచ్చా. రేపు సాయంత్రం బండికి వెళ్లిపోవాలి.” అని బదులిచ్చాడు. సాంబయ్య నిట్టూర్చడం మోహన్ చూపు దాటిపోలేదు.

అరకిలోమీటర్ వెళ్ళాక కృష్ణప్రసాద్ గారు నడుచుకుంటూ వెళ్ళడం చూసాడు మోహన్. అయన చేతిలో ఏవో పుస్తకాలున్నాయి. సాంబయ్యని రిక్షా ఆపమని రిక్షా దిగి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్లి “నమస్తే సర్, బాగున్నారా?” అని పలకరించాడు.
అవడానికి వాళ్ళ నాన్నకి స్నేహితుడే అయినా కృష్ణప్రసాద్ అంటే చనువు కంటే భయం, గౌరవం ఎక్కువ మోహన్ కి.
అందులోనూ తను అయన స్టూడెంట్ ఒకప్పుడు. అందుకని ఆ అలవాటు అలా ఉండిపోయింది.
అయన ఒక్కక్షణం ఆగి “నువ్వు మోహన్ కదా? బాగున్నానోయ్… నువ్వెలా ఉన్నావు? అమ్మ బాగుందా? నాలుగురోజులు ఉంటావా? రేపొకసారి ఇంటికి రా” అన్నారు.
నువ్వు రాకతప్పదు అన్న అర్ధం స్పురించింది అయన మాటల్లో. అయన మాటే అంత. లెక్చరర్ అవడం వల్లేమో ఒకరకమైన  గాంభీర్యం ఉంటుంది అయన మాటల్లో.
మొదటినుంచీ ఆయనతో మోహన్ జరిపిన సంభాషణలన్నీ ఏకపక్షమే, అయన వక్త… మోహన్ శ్రోత!
మోహన్ ఇంకేం చెప్పలేకపోయాడు. ఎలాగూ తెల్లవారాక ఆయనింటికి వెళ్ళాలికదా అని తను మధిర ఎందుకు వచ్చాడో చెప్పలేదు.
ఆయనకి మళ్ళీ కలుస్తానని చెప్పి తిరిగొచ్చి రిక్షాలో కూర్చున్నాడు మోహన్.
“ఏం బాబూ, ఏమాలోచిస్తున్నారు? ఆ కటికాయన మారడు బాబూ. ఎదవ డబ్బులకి కక్కుర్తిపడి తల్లికాబోతున్న కూతుర్ని అన్యాయంగా చంపుకున్నాడు. ఈయన పిల్లలకి ఏం పాఠాలు చెప్పేవాడో ఏమో” అని నిట్టూర్చాడు సాంబయ్య.
ఆ మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు మోహన్. అప్రయత్నంగా రాగిణి రూపం కళ్ళముందు కదలాడింది.
రాగిణి అంటే కృష్ణప్రసాద్ గారి కూతురు. స్కూల్లో, కాలేజీలో తన సేనియర్. ఎప్పుడూ నవ్వుతూ, నవిస్తూ అందరికీ తల్లోనాలుకలా ఉండే రాగిణి అక్క చనిపోయిందా? ఎలా?
అదే అడిగాడు మోహన్. సాంబయ్య గట్టిగా ఊపిరి పీల్చుకుని “రెండేళ్ళ కింద అనుకుంట బాబూ, ఆయమ్మ తనతో పాటే పనిచేసే సుందరం అనే కుర్రాణ్ణి పెళ్ళిచేసుకుంది.
ఆ బాబుది వీళ్ళ కులం కాకపోయినా సారు ఏమీ అడ్డుచెప్పలేదు. అంతా బాగానే ఉంది అనుకున్న రోజుల్లో, ఒకరోజు అల్లుడు కారు కొంటానికి డబ్బులు సాయం అడిగాడంట.
ఉంటే ఇవ్వాలి లేకపోతే లేవని చెప్పాలి. ఈయన మాత్రం కూతుర్ని నానా మాటలు అని పంపించాడట. పాపం ఆయమ్మ అదేరోజు రాత్రి ఉరిపోసుకుని చచ్చిపోయింది.
రిటైరయ్యాడు, లచ్చలు లచ్చలు డబ్బులున్నాయి. ఏం పోయేటప్పుడు మీదేసుకుని తీసుకుపోతడా ఆ డబ్బుల్ని?” అని ఆగి, “ఏమనుకోకండి బాబూ… ఆయన్ని అనేంత పెద్దోన్ని కాదు. కానీ నోరూరుకోక ఏదో వాగేసాను. ఇంటికొచ్చాం దిగండి బాబూ” అన్నాడు.
రిక్షా దిగి సాంబయ్యకి డబ్బులిచ్చి పంపేశాడు. తను వస్తున్నట్టు ముందుగానే చెప్పడంతో అద్దెకుండేవారు మోహన్ వాళ్ళు తమకోసం అట్టిపెట్టుకున్న వాటాని శుభ్రం చేయించి పెట్టారు.
తాళం తీసి లోపలకి వెళ్లి లైట్స్ వేశాడు. ఆ కాంతిలో గదులన్నీ ఒకసారి తృప్తిగా చూసుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు.
ఆ ఇంట్లోనే తన బాల్యమంతా గడిచింది. తన డిగ్రీ పాసయ్యి ఉద్యోగం వచ్చిందని చెప్పినరోజు నాన్న ఎంత సంతోషించారని!! తన మొదటి జీతంతో ఇంటికి రంగులు వేయించి పెళ్లికూతురులాగా ముస్తాబు చేసారు.
ఎప్పుడూ చుట్టాలు పక్కాలతో, పైన ఉంది చదువుకునే పిల్లలతో ఇల్లు ఎంత సందడిగా ఉండేదో! అలాంటి ఈ ఇంటికి కాలదోషం పట్టబోతున్నది. ఎలాగైనా ఇల్లు అమ్మడం ఆగిపోతే బాగుండు… కానీ దాన్ని ఆపడం తనవల్ల అయ్యే పనేనా?

ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న మోహన్ కి ఒక తోడు దొరికింది. ఆ తోడు పేరు ‘ఆకలి’. ఎప్పుడో మధ్యాహ్నం రైలెక్కకముందు ఇంట్లో తిన్న అన్నం. అప్పటినుండి ఏమీ తినలేదు.

గంట తర్వాత….
బయటికెళ్ళి భోజనం చేసి వచ్చి మంచంమీద వాలిన మోహన్ కి సాంబయ్య చెప్పిన రాగిణి విషయం గుర్తొచ్చింది.
అది తలచుకుంటేనే మనసంతా దిగులుగా అయిపోయింది. తండ్రి తిట్టాడని ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు రాగిణి. కానీ అలా చేసిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.
అదేంటో రేప్పొద్దున  కృష్ణప్రసాద్ గారిని కలిస్తే తెలుస్తుందేమో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

మర్నాటి ఉదయం.
పదింటికల్లా తయారయ్యి నారాయణకి ఫోన్ చేసాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో ఆక్సిడెంట్ అయితే గంపలగూడెం వెళ్ళాడట. ఇవ్వాళ రావడం కుదరదన్నాడు.
అసలు వచ్చిన పనే అవలేదని విసుక్కుంటూ అలా బయటికి వెళ్దామని బయలేదేరాడు. కొంచెం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది… నిన్న కృష్ణప్రసాద్ గారు కనిపించిన సంగతి.
వడివడిగా అడుగులేస్తూ ఆయనింటికి చేరుకున్నాడు మోహన్.
వెళ్లేసరికి అయన వరండాలో కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఉన్నారు. మోహన్ని చూడగానే చెయ్యి ఊపి ఇంకో కుర్చీ తెచ్చి వేసారు.
కుశలప్రశ్నలు అయ్యాక మోహన్, రాగిణి గురించి అడిగాడు. రాగిణి పేరు వింటూనే అయన కళ్ళల్లో ఒక కన్నీటి పొర కదలాడింది.
తనకి ఈ ముప్పయ్యేళ్ళలో ఎన్నడూ ఎదురవని సంఘటన అది. కృష్ణప్రసాద్ గారి కళ్ళల్లో కన్నీరు!! ఒక్క క్షణం ఆగి అయన చెప్పడంమొదలుపెట్టారు.
“నేను రాగిణిని ఎప్పుడూ అమ్మాయిలా పెంచలేదు మోహన్. నాకు కొడుకు పుడితే ఎలా పెంచి ఉండేవాడినో అలాగే పెంచా. తను ఇష్టపడిందని కులపట్టింపు కూడా లేకుండా తనతో పనిచేసే సుందరానికి ఇచ్చి పెళ్లి చేశా. కానీ  పెళ్ళయ్యాక తెలిసింది. నేను చేసింది కన్యాదానం కాదు, అపాత్రదానం అని. వాడికి లేని వ్యసనం లేదు. పెళ్లి తర్వాత ఎన్నడూ వాడు సరిగ్గా ఉద్యోగం చేసింది లేదు. ఏ ఒక్క నెలా పూర్తి జీతం అందుకున్నవాడు కాదు.
తన ఖర్చులకి డబ్బులు కూడా రాగిణి జీతంలోనుండే తీసుకునే వాడు. ఇక ఇంటిఖర్చుల సంగతి సరే సరి.
బ్యాంకు లెక్కలేవో తారుమారు చేసాడని సస్పెండ్ చేసారు. అప్పుడు ఆ కేసునుండి విడిపించడానికి నేనే డబ్బులు కట్టాను. కానీ ఆ కుక్కతోక సరైతే కదా!
అలాంటిదే మరో నేరం చేసి ఈసారి ఏకంగా జైలుకే వెళ్ళాడు. జామీను ఇవ్వడానికి నన్ను రమ్మంటే నేను జన్మలో వాడి మొహం చూడను, వస్తే బయటికొస్తాడు లేదా జైల్లోనే పోతాడని రాగిణిని తిట్టి పంపించేశా. వాడు పెట్టే హింసకి తోడు నా కోపం కూడా కలిసిందేమో పాపం… పిల్ల తన ప్రాణం తీసుకుంది…” దుఃఖంతో అయన గొంతు మూగబోయింది.
చాలాసేపు అయన ఏడుస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులనుండి ఉగ్గబట్టుకున్న శోకమో…
చెట్టంత మనిషి, తామంతా ‘ఐరన్ మేన్’ అని పిలుచుకునే కృష్ణప్రసాద్ గారు అలా చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే మోహన్ తట్టుకోలేకపోయాడు. కానీ ఆయనని అనునయించే ధైర్యం తనకి లేకపోయింది.
చివరకి ఆయనే తెప్పరిల్లి “రాగిణి చనిపోయాక తెలిసింది… తను మూడునెలల గర్భవతి అని. ఆ సంగతి ముందే తెలిస్తే నా తల్లిని నేను కళ్ళల్లో పెట్టుకు చూసుకునేవాడిని. ఆ సుందరానికి రాగిణి మరణం జనం దృష్ఠిలో నన్నొక రాక్షసుడిలాగా చిత్రీకరించడానికి సాధనంగా పనికొచ్చింది…  అప్పటిదాకా నన్ను గౌరవించేవాళ్ళు, నేను నామనుషులు అనుకున్నవాళ్ళు  కూడా మెల్లిగా నన్ను తప్పుకుతిరగడం మొదలుపెట్టారు.
అన్నట్టు నీకు తెలుసో లేదో, రాగిణి చనిపోవడానికి వారం ముందే సీతారాం అమెరికా వెళ్ళిపోయాడు… వాడి కొడుకు దగ్గరికి. దాంతో, నా అన్నవాళ్లు ఎవరూ లేక, నా ఘోష చెప్పుకోవడానికి కూడా దిక్కులేక ఇంకా ఎందుకు బతికున్నానా అనిపించింది.  నా బంధువులంతా నేనెంత తొందరగా పోతానా నా ఆస్తి ఎప్పుడు చేజిక్కుతుందా అని ఎదురుచూసేవారే.
అందుకే, ఈ మధ్యే నా తర్వాత ఈ ఆస్తి మంచిపనులకు ఉపయోగపడేలా ఒక ట్రస్ట్ పెట్టాను.
అనాధపిల్లలకి, పేదపిల్లలకి నీడనిచ్చి, ఇంత చదువు చెప్పే మంచి స్కూల్ ఒకదాన్ని కడదామని ఉంది. అంత బిల్డింగ్ కట్టించడం ఈ వయసులో నాకు శక్తికి మించిన పనే… కానీ తప్పదు.” అన్నారు.
కృష్ణప్రసాద్ మాటలు విన్న మోహన్ మదిలో ఒక ఆలోచన మెరిసింది. గొంతు సవరించుకొని, “సార్, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీరు ఇప్పుడు బోలెడంత ఖర్చు పెట్టి వేరే  కట్టించడం దేనికి సార్? మన ఇల్లు ఉంది కదా! అది మీరే ఉంచేసుకోండి. ఎలాగూ దానిమీద వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. నాన్న జ్ఞాపకంగా మిగిలున్న ఆ  ఇల్లు అమ్ముదామని వచ్చాను. దేవాలయం లాంటి ఆ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు. కానీ అమ్మ బలవంతం మీద వచ్చాను. ఇల్లు అమ్మడం నాన్నకి కూడా ఇష్టంలేనట్టుంది. అందుకే మీరు కనిపించేలా చేసారు.
మీ స్నేహితుడు ఇష్టపడి కట్టించిన ఆ ఇల్లు, మీరు చేయబోయే ఈ మంచిపనికి అయన జ్ఞాపకంగా ఉపయోగపడడం కంటే కావలసిందేముంది? కింది వాటాలో అద్దెకి ఉంటున్నవాళ్ళు వేరే ఇల్లు కట్టుకున్నారని విన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే మీరు ఇల్లు స్వాధీనం చేసుకోవచ్చు. పైవాటాలో ఉండే వాళ్ళు కూడా వేరే చోటికి మారిపోతున్నారట.” అన్నాడు.
“లేదు మోహన్, మీ నాన్నతో ఉన్న స్నేహాన్ని నేనిలా వాడుకోదల్చుకోలేదు. ఆ ఇల్లు కట్టించడానికి వాడెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది. కానీ ఇల్లు నాకు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. మార్కెట్ రేట్ ఎంతో అది లెక్కకట్టి ఇస్తాను.” అని నచ్చజెప్పబోయారు కృష్ణప్రసాద్.
కానీ మోహన్ మాత్రం ఖచ్చితంగా “అయితే మీతో మా నాన్నకి ఉన్న స్నేహానికి, మాకు మీరు నేర్పిన విద్యాబుద్దులకి, మీరు చేయబోయే మహత్కార్యానికి వెల కట్టండి సార్ . కట్టగలరా? లేదు కదా… అందుకే ఇంటికి కూడా మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు.
ఇంటి పేపర్స్ అన్నీ ఇప్పుడు నాతోపాటే ఉన్నాయి. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. మీరింకేం మాట్లాడకండి” అన్నాడు.
తన స్నేహితుడి కొడుకు, తన దగ్గర చదువు చెప్పించుకున్న కుర్రాడు, తను తలపెట్టిన సత్కార్యానికి సాయంగా ముందుకు రావడం చూసి కృష్ణప్రసాద్ కళ్ళు మరొకసారి చెమర్చాయి.
ఆరోజు కృష్ణప్రసాద్ గారింట్లోనే భోజనం చేసి రాత్రికి ఆయనదగ్గర సెలవుతీసుకుని ఇల్లుచేరాడు. వాళ్ళ అమ్మకి, రజితకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఇల్లు అమ్మడంలేదని తను తీసుకున్న నిర్ణయానికి అమ్మ కొంచెం బాధపడింది కానీ, రజిత మాత్రం చాలా సంతోషించింది. ఆ వెంటనే  నారాయణకి ఫోన్ చేసాడు.
తను ఇల్లు అమ్మబోవడంలేదని, వచ్చిన ఆ అవతలి పార్టీని వేరే ఇల్లు చూసుకొమ్మని చెప్పి ఫోన్ పెట్టేసాడు
ఇల్లు అమ్మకపోతే ఏమవుతుంది? మహా అయితే ఇ.ఎమ్.ఐ. కింద ఇద్దరిలో ఒకరి జీతం మొత్తం ఖర్చవుతుంది. కానీ తను చేసిన పని ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగునింపుతుంది. నాన్న జ్ఞాపకానికి ఇంతకంటే అందమైన రూపం ఇంకేముంటుంది!

ఆరాత్రి, తను చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాడు.
మరుసటిరోజు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రైల్వేస్టేషనుకి బయల్దేరాడు మోహన్.
మబ్బులు విడిపోయాయి.. పైన ఆకాశంలోనూ, మోహన్ మనసులోనూ!

ప్లాటుఫారం 2 మీదికి రైలొచ్చి ఆగింది.సావిత్రి గుంజుకున్న వాచీని విడిపించుకోవడానికి డబ్బులు తెచ్చాడు, మొన్న గొడవ  పడినవాడు. వాచీ ఇస్తూ కూడా ఇంత గొంతేసుకుని వాణ్ణి తిడుతుంది సావిత్రి.
అప్పుడు చూసాడు మోహన్, సావిత్రిని… ఈమె మారదు… మారలేదు కూడా అనుకుంటూ లేచి నిలబడ్డాడు.
రైలెక్కబోతూ  ప్లాటుఫారం చివరనున్న ఖాళీ సిమెంటు బెంచీ వైపు చూసాడు.

ఒక్కక్షణం వాళ్ళ నాన్న భూషణంగారు ఆ బెంచీ మీద కూర్చుని తనని చూసి నవ్వినట్టనిపించింది.

About the Author

vparupal
Hi People, this is Varun from Los Angeles. I am working as an IT professional... born and brought up in Madhira, Khammam Dist. I did my masters in Kakatiya University, Warangal. Happily married to Haritha and blessed with sweet Nisanth. My hobbies are playing cricket (these days online only) and writing stories. I am here to contribute my stories to the content of this website. Hope you will like it :)

2 Comments on "జ్ఞాపకం (Published in Telugu Velugu Feb 2013 issue) by Varun Parupalli"

  1. Thank you, Mohan garu!
    I was a bit busy these days 🙂

  2. Nice to see your post after a long time. Good one.

Comments are closed.