మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరా… ఏమో…కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది అభాగ్యనగరమేమో అనిపిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
రెండువేల ఎనిమిది నుంచి హైదరాబాద్ లోనే ఆరువేల మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇలా అదృశ్యమైనవారిలో కేవలం రెండువేలనూటతొమ్మిది మంది మాత్రమే తిరిగి ఇళ్లకు చేరారు. ఇలా మిస్సవుతున్న వారిలో ఎక్కువ మంది 12 నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉన్న బాలికలే కావడం ఆందోళన కలిగించే విషయం. రెండువేల ఎనిమిది , పదకొండు మధ్యలో తొమ్మిది వందల డెబ్బయి నాలుగు మంది బాలికలు కిడ్నాప్ కు గురికావడమో లేదా ఇంటి నుంచి వెళ్ళిపోవడమో జరిగిందని హైదరాబాద్ పోలీసులే చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసులు ఇదే టైమ్ లో మరో ఐదువందల పదకొండు మంది బాలికల మిస్సింగ్ కేసులు నమోదు చేయడం గమనార్హం.
పిల్లలు అదృశ్యమవడానికి అనేక కారణాలున్నా, బాలిక అదృశ్యం వెనుక మాత్రం అత్యంత దారుణమైన కుట్ర దాగుందన్నది పచ్చి నిజం. ఇలా అదృశ్యమైన బాలికల్లో ఎక్కువ మంది వేశ్యా గృహాలకు తరలించబడుతున్నవారే.
ఇక్కడే మరో ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. బెంగుళూరు, చెన్నైల్లోకంటే మన హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గుతున్న మాట నిజమే. అయితే, పిల్లలు అదృశ్యాల కేసుల్లో మాత్రం మన రాష్ట్ర రాజధానే టాప్ లో ఉంది. ఇది నిజంగా సిగ్గుతో తలవొంచుకోవాల్సిన విషయం.
చాలా సందర్భాల్లో పిల్లలు స్కూల్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడే కిడ్నాప్ కు గురవుతున్నారు. ఇలాంటి కేసుల్లో కిడ్నాపర్లు పెద్ద మొత్తం ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొన్ని సందర్బాల్లో ఐదు నుంచి పది లక్షలు దాకా ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.
పిల్లలకు తగినంత రక్షణ కల్పించడంలో పేరెంట్స్ తో పాటుగా ప్రభుత్వం కూడా సత్వర చర్యలు తీసుకోవాల్సిందే.